జగన్ పై మరోసారి అభిమానం చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

15201చూసినవారు
జగన్ పై మరోసారి అభిమానం చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఒక్క విమర్శ వచ్చినా ఎదురుదాడి చేసేందుకు కొంతమంది ఉండేవారు. ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీమంత్రులు డీకే అరుణ, ఆనం రామనారాయణరెడ్డి, విశ్వరూప్, రోశయ్య వంటి వారు విమర్శలకు ప్రతి విమర్శలు చేసేవారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ పై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు అని చెప్పవచ్చు. అలా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కు అదే కోటరీని నియమించుకున్నారు.

అలాంటి వారిలో ఎమ్మెల్యే రోజా..డిప్యూటీ సీఎం పాముల పుష్ఫశ్రీవాణి కూడా ముందు వరుసలో ఉంటారు. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన వ్యక్తులు ఎవరైనా సరే అనవసరం. ఎదురుదాడికి దిగాల్సిందే. అంతేకాదు పాముల పుష్పశ్రీవాణికి జగన్ అంటే వీరాభిమానం. కట్టెకాలేవరకు జగన్ తోనే అంటూ ఆమె అన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. అంతటి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, వైఎస్ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు.

ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన పుష్పశ్రీవాణి పాప నామకరణాన్ని నిర్వహించారు. వైఎస్ తో పాటు జగన్, ఆయన భార్య భారతి పేర్లు కలసి వచ్చేలా తమ బిడ్డకు 'యశ్విత శ్రీజగతి' అన్న పేరును పెట్టుకున్నారు. పుష్ప శ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు అరకు జిల్లా వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. శనివారం నాడు పాప నామకరణం విజయనగరం జిల్లా చిన మేరంగి గ్రామంలో వైభవంగా జరిగింది. ఏపీ మంత్రి బొత్సతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి దంపతులు మాట్లాడుతూ, తమ బిడ్డ పేరులో తమ అభిమాన నేతలందరి పేర్లూ కలిసున్నాయని, యశ్వితలో తొలి అక్షరం వై కాగా, శ్రీజగతిలో ఎస్ తో పాటు జగన్, భారతి పేర్లు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్