జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి మాట్లాడుతూ పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ బెల్టుషాపు నిర్వహిస్తున్నాడని నెపంతో మహబూబ్నగర్ రూరల్ రామచంద్రపురం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం దారుణమన్నారు. రాజకీయ పక్షపాతంతో పోలీసులు అనవసరంగా అమాయకులను అరెస్టు చేసి వారిని హింసించడం సరికాదన్నారు. రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న బెల్టుషాపులు చాలా ఉన్నాయని వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెరాస పార్టీ కి సంబంధించిన బెల్టుషాపులను కొనసాగిస్తూ ఆధారాలు లేకుండా అమాయకులైన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం తగదన్నారు. అరెస్టు చేసిన మహేష్ ను వెంటనే విడుదల చేయాలని లేనిచో జిల్లా ఎస్పీ కలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.