ఈ ఏడాది ఐపీఎల్ క్రికెట్ పోటీలు భారత్ లో జరుగుతున్నాయి. గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ వచ్చే సీజన్ లో భారత్ లో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని యూఏఈ తరహాలోనే పరిమిత వేదికల్లో మ్యాచ్ లు జరపాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ కు స్థానం దక్కలేదు. ఇప్పటివరకు బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాలను మాత్రమే ఎంపిక చేశారు.
కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న తరుణంలో ముంబయిని కూడా వేదికగా ఎంపిక చేయాలా వద్దా అనే సందేహంలో ఉంది బీసీసీఐ. అయితే అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ మహారాష్ట్ర సర్కారు అనుమతి నిరాకరిస్తే, ప్రత్యామ్నాయ వేదికగా హైదరాబాద్ ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఓపెనింగ్ జరుపుకున్న మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలోనూ ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ నిశ్చయించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియంలో ఐపీఎల్ పోటీలు నిర్వహిస్తే లీగ్ మరింత ఆకర్షణీయంగా మారుతుందని బోర్డు భావిస్తోంది.