కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోడీగూడా గ్రామానికి చెందిన కనక మారుతి, భార్య కనక లక్ష్మి బాయి అనే దంపతులీద్దరు మృతి చెందడంతో నలుగురు పిల్లలు కనక సీతా బాయి (18), కనక దివ్య (16), కనక జ్ఞానేశ్వర్ (15), కనక విజయ్ కుమార్ (08) అనాధలుగా మారారు. వారి ఆలనా పాలనతో పాటు తినడానికి తిండికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రెహమాన్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ) సామాజిక సేవకులు దాత రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో ఆ పిల్లల సంరక్షణ కోసం ఆదివారం నిత్యావసర సరుకులు 50 కిలోల బియ్యం, 15 లీటర్లు మంచి నూనె, 5 కేజీ ల పెసర పప్పు, కేజీ ల గోదుమ పిండి, 5 కేజీ ల చక్కెర తో పాటు 2 వేలు నగదు పిల్లలకు ఆర్ధిక సహాయం అందించారు. చిన్నారులు నలుగురు అతి చిన్న వయసులోనే తల్లిదండ్రులీద్దరినీ కోల్పోవడం చాలా దురదృష్టకరమని వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉందని రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరు ఉన్న పిల్లలే నేటి పోటీ సమాజంలో నీలదొక్కుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటిది బాల్యం నుండే తల్లిదండ్రులు, నా అనే కుటుంబ సభ్యులు ఎవరూ లేక జీవన పోరాటం సాగించడం ఎంతో కష్టమన్నారు. చిన్నారులు నలుగురు మానసికంగా కృంగిపోకుండా మనోధైర్యంగా ఉంటూ భవిష్యత్తులో ప్రతి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఈ ప్రపంచంలో అందరితో పాటుగా ఆదర్శంగా జీవించాలని మనోధైర్యాన్నిచ్చారు. ఇలాంటి వారికి సభ్య సమాజం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనాధలుగా మారిన చిన్నారుల కుటుంబానికి రెహమాన్ ఫౌండేషన్ అండగా ఉంటుందని చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సేవకులు, దాతలు ముందుకొచ్చి పిల్లలను ఆదుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాధవ్ విలాస్ (రెహమాన్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు), రాథోడ్ మనోజ్, జాటోత్ దవిత్ కుమార్, జాధవ్ ప్రకాష్, సాయి, నవీన్, రాజేష్, గ్రామస్తులు సహింశా, రామచందర్ తదితరులు ఉన్నారు.