దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధరలు సెంచరీ దాటేసిన పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనం బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా డీజిల్ ధరలు కూడా పెట్రోల్ ధరలకు చేరువవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు, ప్రజలు చమురు ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ధరలు మాత్రం తగ్గడం లేదు.
ఈ పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. బండి తీస్తే వంద కాగితం తీయాల్సిన పరిస్థితి నెలకొనడంతో వాహనం తియ్యాలంటే హడలిపోతున్నారు. ఒకప్పుడు డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లేవారు ఇప్పుడు పెరిగిన ధరల నేపథ్యంలో బైక్ తియ్యాలంటే హడలిపోతున్నారు. వీటితోపాటు వంట గ్యాస్ ధర సైతం పెరుగుతున్నాయి. వంట గ్యాస్ ధర పెరగడం వల్ల సామాన్యుడికి చాలా ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు పెట్రోల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరిచినట్లైంది.
డీజిల్, పెట్రోల్ దరలు పెరుగుతుండటం వల్ల దాని ప్రభావం ఇతర వాటిపై పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ తీవ్రనష్టాల్లో ఉంది. తాజాగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ నష్టాలు కాస్తా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే టికెట్ ధరలు పెంచాల్సిన పరిస్తితి నెలకొంది. అలాగే సరుకు రవాణాల్లో వాహనాల పాత్ర కీలకం. అయితే ఇంధనం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కూరగాయల ధరలు సైతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే పాలు ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలు రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో సామాన్యుడు జీవనానికి అవసరమైన అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అసలే కరోనా కాలం. ఇప్పటికే ఆర్థిక రంగం కుదేలైంది. ఇప్పడిప్పుడు కరోనా కష్టాల నుంచి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బయటపడుతున్నాడు. ఇలాంటితరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం వారికి కష్టాలు మళ్లీ మెుదలయ్యాయి. సామాన్యుడు బతకడం కూడా కష్టంగా మారిన పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో రాజకీయ దుమారం రేపుతోంది. సామాన్యుడికి అండగా విపక్షాలు అండగా నిలుస్తున్నాయి. సామాన్యుడి పక్షాన పోరాటం చేస్తున్నాయి. అంతేకాదు అనే రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలే కాదు బీజేపీ పార్టీలోని కీలక నేతలు సైతం పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
అంతేకాదు పలువురు నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. అలాగే శివసేన నేత ఊర్మిలా మతోండ్కర్ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. అటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన పరిస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కీలక ప్రకటన చేశారు. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లలో పెట్రో ధరలు భారీగా పెరిగాయని..ఆ ప్రభావమే దేశీయ మార్కెట్‌లపై పడిందని చెప్పుకొచ్చారు.
చలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ భారీగా ఉంటుందని..ఆ డిమాండ్ కారణంగానే వినియోగదారులు ధరాభారం మోయాల్సిన పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. అయితే శీతాకాలం పోతే పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుందని..ఫలితంగా ధరలు దిగివస్తాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ శీతాకాలం కూడా మరికొన్ని రోజుల్లోనే ముగియనున్న నేపథ్యంలో అప్పటికి కూడా ధరలు తగ్గకపోతే ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల పోరుబాటతో దేశవ్యాప్తంగా కేంద్రంపై ప్రతికూల పరిస్థితి నెలకొంది. రైతులను దగ్గర చేసుకునేందుకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పటికే సిఈసీ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవకపోతే ఈ ఐదు ప్రాంతాల్లో పంజాబ్ లో వచ్చిన ఫలితాలే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.