ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా గగనంగా మారింది. పిజీలు చేసిన వారు సైతం ఉద్యోగాలు దొరక్క రోడ్లపై తిరుగుతున్న పరిస్థితి. అంత చదువు చదివి ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఓ మహిళ తన తెలివికి పదును పెట్టింది. చదివింది టెన్త్ అయినా నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన ఆలయ పూజారి కుమార్తె నందిని(33). నందినికి చిన్నప్పటి నుంచి వైద్యురాలిగా స్థిరపడాలని ఉండేది. అయితే ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో టెన్త్ క్లాస్ తో చదువు మానాల్సి వచ్చింది. ఆ తర్వాత నందినిని శ్రీకాంత శాస్త్రి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.
ఇంతలో నందిని తండ్రి చనిపోవడంతో చెల్లెలి పెళ్లి భారం ఆమెపై పడింది. దీంతో ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. భర్త సంపాదనతో పాటు తాను కూడా చిన్న చిన్న పనులు చేసి సంపాదించేది. అయితే అది ఏ మూలకూ సరిపోయేది కాదు. ఈ క్రమంలోనే ఆమె బంధువుల్లో దగ్గరి వారైన కొందరు ఊబర్ సంస్థ గురించి చెప్పారు. అందులో క్యాబ్ నడిపిస్తే దాని వల్ల లాభం ఉంటుందనే సరికి ఆమె, ఆమె భర్త కలిసి తమ వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి టయోటా కారు కొని ఊబర్‌లో తిప్పడం స్టార్ట్ చేశారు.
ఊబర్ సంస్థకు ఎవరినైనా రిఫర్ చేసి అందులో క్యాబ్ డ్రైవర్లను చేర్పిస్తే అలా చేర్పించిన వారికి రిఫరల్ అమౌంట్‌ను ఇస్తుంది కంపెనీ. ఆ రిఫరల్ అమౌంట్ రూ.3 వేలు వరకు ఉంటుంది. దీంతో నందిని ఆమె భర్తతో కలిసి ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఓ చిన్న ఆఫీస్ పెట్టి అందులో నలుగురికి పని కల్పించారు. అలా ఆ ఆఫీసు ద్వారా ఇప్పటి వరకు నందిని, ఆమె భర్త కలిసి 600 మంది డ్రైవర్లను ఊబర్‌లో చేర్పించారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు ఆమె నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తోంది.
ఓ వైపు క్యాబ్‌లు తిప్పడం, మరో వైపు రిఫరల్స్‌ను చేర్పించడంతో ఆమెకు ఉన్న అన్ని కష్టాలు దూరమయ్యాయి. ఇప్పుడామె ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. తాను ఎలాగూ డాక్టర్ కాలేకపోయాను.. తన కూతురిని అయినా డాక్టర్‌ను చేయాలని నందిని ఆలోచిస్తోంది. మెుత్తానికి టెన్త్ క్లాస్ చదివిన నందిని తన తెలివితేటలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించింది.