బంగారు తెలంగాణలో దళితుల అభివృద్ధి జాడ ఎక్కడ?

1106చూసినవారు
బంగారు తెలంగాణలో దళితుల అభివృద్ధి జాడ ఎక్కడ?
అనేక ఆశలు ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో దళితుల అభివృద్ధి అందని ద్రాక్షగా మారిందని, దళిత కాలనీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కుసుంభ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో జిల్లా ప్రతినిధి బృందం నల్లబెల్లి మండలంలోని శనిగరం, రామతీర్థం దళిత కాలనీలను సందర్శించి అక్కడి కాలనీ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కాలనీవాసుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత కాలనీల పేదలు తలదాచుకోడానికి సరైన ఇల్లు లేక వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ దుర్భర జీవితాలను గడుపుతున్నారని రోడ్లు మురికి కాలువలు కరెంట్ పోల్స్ సైతం లేవని ప్రస్తుత వర్షాలకు ఉన్న ప్రస్తుత గుడిసె ఇండ్లలో సైతం వర్షపునీరు నిలిచి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొన్నదని దాంతో దోమలు వ్యాపించి సీజనల్ రోగాల బారిన పడ్డారని ఇన్ని సమస్యలతో దళిత కాలనీలు కొట్టుమిట్టాడుతున్న అధికార యంత్రాంగానికి కనీస పట్టింపు లేక పోవడం దారుణమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు తదితర సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన నర్సంపేట నియోజకవర్గంలో ఏ ఒక్క దళిత కుటుంబానికి కనీసం డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎంతో అభివృద్ధి చేశామని ప్రచార ఆర్భాటం చేస్తున్న అధికార పార్టీ నాయకులకు అత్యంత వెనుకబడిన దళితులు దళిత కాలనీలు కానరాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో దళిత కాలనీల ఏర్పాటు వాటి అభివృద్ధి ఇండ్లు ఇండ్ల స్థలాలురాజకీయాలకు అతీతంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేసింది మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ మాత్రమేనని ఆయన స్ఫూర్తితోనే ఐక్య పోరాటాలతో పాలకుల మెడలు వంచి కాలనీల అభివృద్ధిని ఇచ్చిన హామీల అమలును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఓట్లు సీట్లు అధికారం కోసం పేదలను ఓటర్లుగా మాత్రమే చూసే పార్టీల నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కనకం సంధ్య, మండల కార్యదర్శి దామ సాంబయ్య, ఏ ఐ ఎఫ్ డి ఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు, బోళ్ల సుదర్శన్, క్యాతం శ్యామ్, ఓంటరు రాజు, హర్షం అశోక్, వెండి బాబు, గోవింద్ రాజేందర్, వేల్పుల రాకేష్, గంగారపు అనిల్, మాట్ల సుధా, కోమల, మామిడిపల్లి భాస్కర్, జమున, సునీత, మంద కళ్యాణి లతో పాటు ఆయా కాలనీవాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్