యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 25న వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకను కోవిడ్-19 నిబంధనలతో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. బాలాలయాన్ని ముక్కోటి ఏకాదశిన ఉదయం 3గంటలకు తెరిచి, ఉదయం 6.43 గంటలకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 6.43 నుంచి 9.30 గంటల వరకు వైకుంఠద్వార దర్శనంతో పాటు ఉదయ దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు. పాతగుట్ట ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి, 6.43 గంటలకు ఉత్తర ద్వారదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అదేరోజు నుంచి బాలాలయంలో 30వ తేదీ వరకు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామన్నారు.