గణిత బ్రహ్మ మన కడప వాసి

331చూసినవారు
గణిత బ్రహ్మ మన కడప వాసి
పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు అతను ఎవరు..? గణిత బ్రహ్మగా ఎలా ఎదిగాడో లోకల్ యాప్ ప్రత్యేక కథనం...

కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్‌ 22న జన్మించారు. ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది.

పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్‌ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్‌ వాయించడం జీవితంలో ఒక భాగమైంది.

సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు.

అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్‌ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు.

సంబంధిత పోస్ట్