సూళ్లూరుపేట పట్టణంలోని బాలుడు అదృశ్యంపై జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ వీధిలో నివాసం ఉంటున్న ఎద్దుల రమేష్ రెడ్డి - రజిత దంపతుల కుమారుడు ఎద్దుల రాజా యశ్వంత్ రెడ్డి అనే బాలుడు ఈ నెల 19వ తేదీన జిరాక్స్ కోసం నెట్ సెంటర్ కు వెళ్లి వస్తానని ఇంట్లో వారికి చెప్పి వెళ్లడం జరిగిందని అన్నారు. అయితే రాజా యశ్వంత్ రెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల కలిగించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు బాలుడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఆయన తెలియజేశారు. సూళ్లూరుపేట ఇన్చార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక బృందం స్థానికంగా గాలింపు చర్యలు చేపడుతున్నారని అదేవిధంగా తడ సబ్ ఇన్స్పెక్టర్ వేణు ఆధ్వర్యంలో చెన్నై పరిసర ప్రాంతాల్లో గాలించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా దొరవారిసత్రం సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తిరుపతి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లు ఆయన తెలియజేశారు. బాలుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని, ఎవరైనా బాలుడిని గుర్తిస్తే 9440796367, 9440796360,9440796363 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన తెలియజేశారు.