ప్రజలకు సమన్యాయం కోసమే కొత్త మండలాలు ఏర్పాటు చేసినట్లు కొడంగల్ ఎమ్మెల్యే నరెందర్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలో కొత్తగా రెండు మండలాలు కొత్తపల్లి, గుండుమాల్ మండలాలను, వివిధ శాఖలను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, క్రీడా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక గతంలో ఎన్నడు లేని విధంగా సత్వర నాయం అందుతుందని, ఈ దిశగా ఆలోచించిన ఘనత కేసీఆర్ దే అన్నారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో 13 మండలాలు ఏర్పడితే అందులో మెజార్టీ మూడు మండలాలు తన నియోజకవర్గానికి తెచ్చుకున్నామన్నారు. నూతనంగా కొత్తపల్లి గ్రామం మండల కేంద్రం గా ఏర్పాటు అయిన సందర్భంగా తహసీల్దార్, ఎంఈఓ మరియు అగ్రికల్చర్ కార్యాలయాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, జడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, ఆయా మండలాలకు సంబంధించిన తహసిల్దార్లు, ఎంఈఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.