విద్యా సర్వే నివేదిక విడుదల చేసిన డి.ఇ. ఓ

851చూసినవారు
విద్యా సర్వే నివేదిక విడుదల చేసిన డి.ఇ. ఓ
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెఢరేషన్ (TSUTF) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యారాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను బుధవారం ఉదయం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి.మాదన్ మోహన్ మరియు సంఘ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు ఒక మెమోరాండంను డి. ఇ. ఓ కు అందజేశారు.

ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19 కారణంగా పలురంగాలు ప్రభావిత మయ్యాయి. ఆ క్రమంలోనే విద్యారంగం కూడ తీవ్ర ప్రభావానికి లోనైంది. ఖమ్మం జిల్లాలో గత విద్యా సంవత్సరంలో నెల ముందుగానే పాఠశాలలు మూత పడినాయి. యస్‌యస్‌సి తో సహా అన్ని పరీక్షలు రద్దైనాయి. వేసవి సెలవుల అనంతరం ఈ విద్యాసంవత్సరం (2020-21) జూన్‌ 12 నుండి ప్రారంభం కావాల్సి ఉన్నది. కాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల ప్రారంభంపై ఆంక్షలు కొనసాగుతున్నందున, మన రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

జిల్లాలో ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో హడావుడి చేస్తూ ఫీజులు వసూలు చేసుకుంటుండగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం నిర్వహణ, పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్‌ క్లాసుల బోధనకు గల అవకాశాలు తదితర అంశాలపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను క్షేత్రస్థాయి నుండి సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టియస్‌యుటిఎఫ్‌) రాష్ట్ర కమిటీ నిర్ణయించి, సర్వే పత్రాన్ని రూపొందించింది. ఖమ్మం జిల్లాలో మా ఉపాధ్యాయులు 142 మంది తాము పని చేస్తున్న గ్రామాలు, పరిసర గ్రామాల్లో జూన్‌ 22 నుండి 27 వరకు పర్యటించి స్వచ్ఛందంగా సర్వే నిర్వహించారు. 21 మండలాల్లోని 144 గ్రామాలు & నగరాలు, పట్టణాల్లోని వార్డులలో సర్వే నిర్వహించి 2345 మంది తల్లిదండ్రులు, 4860 మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు 1642 మందితో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు 703 మంది అభిప్రాయాలను కూడా సర్వేలో సేకరించి నమోదు చేశారు. సర్వే సందర్భంగా 91% తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెంటనే పాఠశాలలను పున:ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు.

సర్వే సందర్భంగా తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చల ద్వారా వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా టియస్‌యుటిఎఫ్‌ జిల్లా కమిటీ పక్షాన ఈ క్రింది సూచనలను ప్రభుత్వానికి తెలియజేశారు.

(1)ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా పాఠశాలలు ఆఫ్‌లైన్‌లో ప్రారంభించాలి.
(2) విద్యార్థులకు ఇచ్చే మధ్యాహ్నా భోజనం మెనూను పెంచి, పాఠశాల పున:ప్రారంభం వరకూ ఆ తర్వాత కూడా కోవిడ్‌ ప్రభావం తగ్గేవరకూ విద్యార్థుల ఇండ్లకు సరఫరా చేయాలి.
(3) పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకే ప్రాధాన్యతనివ్వాలి. ఆన్‌లైన్‌ బోధన ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. ఉపాధ్యాయుని బోధనకు ఆన్‌లైన్‌ తరగతులు సహాయకారిగా మాత్రమే ఉండాలి.
(4) కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావంలేని గ్రామీణ ప్రాంతాల్లో (మహారాష్ట్రలో వలెనే) భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్‌ తదితర జాగ్రత్తలు పాటిస్తూ వీలైనంత త్వరగా పాఠశాలలు ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాలి.
(5) భౌతిక దూరం పాటించటానికి వసతి సరిపోని పాఠశాలల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లుగా పాఠశాలలు నడపాలి.
(6) మొదట 10,9, తరగతులు, తర్వాత 8,7,6 తరగతులు ఆతర్వాత 5,4,3,2,1 తరగతులు నిర్వహించాలి.
(7) కోవిడ్‌-19 ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేరళ మోడల్‌లో తాత్కాలికంగా ఆన్‌లైన్‌ బోధనను నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాబ్‌లు/స్మార్ట్‌ ఫోన్లు ప్రభుత్వమే ఇవ్వాలి.
(8) జిల్లాలోని అన్ని పాఠశాలలకు, గ్రామ పంచాయితీలకు టి.విలు, కంప్యూటర్లు, సరఫరాచేసి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి. ఆన్‌లైన్‌ బోధనకు వినియోగించుకోవాలి.
(9) పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి మాస్క్‌లు, సబ్బులు, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ పరిశుభ్రత వంటి అంశాలు స్థానిక ప్రభుత్వాలకు అప్పగించాలి. సంబంధిత సిబ్బందిని నియమించాలి. అదనపు నిధులు కేటాయించాలి.
(10) ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలతో పాటు నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు కూడా సరఫరా చేయాలి.
(11) ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలి*
పై సూచనలు పరిగణలోనికి తీసుకొని జిల్లాలో పాఠశాల విద్యారంగ సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్ మోహన్, టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా. దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి.నాగమల్లేశ్వరరావు‌, నెల్లూరి. వీరబాబులు విడుదల చేశారు. జిల్లా నాయకులు షేక్. మహబూబ్ అలీ , బుర్రి. వెంకన్న, పారుపల్లి. నాగేశ్వరరావు, వల్లంకొండ. రాంబాబు,షేక్. రంజాన్, ఉద్దండు షరీఫ్, సురేష్, రవికుమార్, రమేష్, రామకృష్ణ,నవీన్ కుమార్,విద్యాసాగర్, గురవయ్య , శ్రీనివాసరావు తదితరులు ఈ పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులకు నివేదిక కాపీని మరియు టిఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సూచనలతో కూడిన మెమోరాండమ్ ను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్