జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి అడవిలో బుధవారం కార్చిచ్చు చెలరేగింది. దీంతో దాదాపు అరడజను మందుపాతరలు పేలినట్లు అధికారులు తెలిపారు. మెంధార్ సబ్ డివిజన్లోని కృష్ణా ఘాటి సెక్టార్లోని ఫార్వర్డ్ ఏరియాల్లో మధ్యాహ్న సమయంలో సరిహద్దు ఆవలి నుంచి మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేసేందుకు అమర్చిన మందుపాతరలు పేలాయని చెప్పారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు.