బంధం విచిత్రమైన ఆకర్షణ కలది. బంధాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. ఆ బంధం లో ఉన్న ఇరువురి లక్షణాలు, వ్యక్తిత్వాలను బట్టి ఇవి ఉంటాయి. ఆ వివిధ రకాల బంధాలేమిటో, వాటిలో ఉండే వారి లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరస్పరాధారిత: ఈ బంధంలో ఉన్న ఇద్దరూ మరొకరు లేకుండా ఒక్క రోజు కూడా గడపలేరు. ప్రతి దానికీ ఇంకొకరి మీద ఆధారపడిపోయి ఉంటారు. వీరిద్దరూ ఒకరి పక్కన ఒకరు లేకపోతే ఆందోళనకి గురవుతారు. ఒకరితో ఒకరు కలిసి ఉండడం కోసం వీరు ఎన్నో విషయాలు వదిలేస్తారు. ఒకరినొకరు గారాబం చేసుకుంటూ ఒకరి సన్నిధిలో ఒకరు అంతులేని ఆనందం అనుభవిస్తూ ఉంటారు.
స్వతంత్ర: వీరిని పవర్ కపుల్స్ అని కూడా అంటారు. వీరిద్దరికీ ఆత్మ విశ్వాసం ఎక్కువ, కెరీర్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఒకరి నిర్ణయాలని ఒకరు గౌరవిస్తారు, ఒకరి ఎదుగుదలని ఇంకొకరు ప్రోత్సహిస్తారు, ఒకరు చేసే పనులని ఇంకొకరు హర్షిస్తారు. అయితే, కుటుంబం కోసం వీరిద్దరూ ఎంత సమయం కేటాయించగలరనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది.
ప్రతిస్పందిత: ఈ బంధంలో కనీసం ఒకరు, లేదా ఇద్దరూ కూడా ఒక రిలేషన్ షిప్ లో నుండి అప్పుడే బయటకు వచ్చి ఉంటారు. ఆ బాధ పోవాలంటే, దాన్ని మర్చిపోవాలంటే ఇంకొక రిలేషన్ షిప్ అవసరం. ఈ బంధం ఎంతకాలం నిలుస్తుందనే దాని మీద అనుమానాలున్నాయి. ఎందుకంటే, ఈ బంధానికి పునాది రాయి వాస్తవాన్ని అంగీకరించలేకపోవటం. ఇందులో అవతలి వ్యక్తి మీద కంటే ఎవరి మీద వారికే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే, నెమ్మదిగా ఒకరికి ఒకరు నచ్చి ఈ బంధాన్ని ముందుకు తీసుకునివెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు.
సుదూర: ఒకరంటే ఒకరికి బాగా ఇష్టమున్న రోజుల్లో చెరో చోటా ఉండవలసి వచ్చినా పరవాలేదు అనిపిస్తుంది. కొన్నాళ్ళేగా, మ్యానేజ్ చేసేయవచ్చు అనుకుంటారు. కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అని నిపుణులు అంటూ ఉంటారు. కొంత మంది ఈ దూరాన్ని దాటగలరేమో కానీ అందరికీ మాత్రం అది సాధ్యం కాదు.
హానికర: ఈ బంధంలో ఒకరంటే ఒకరికి విపరీతమైన ఆకర్షణ ఉంటుంది, కానీ అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనా అన్నీ పూర్తిగా వ్యతిరేకం. వీరిద్దరూ ఎక్కువగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకరిలో ఉన్న చెడుని బయటకి తీయడంలో రెండవవారు సిద్ధహస్తులు. ఇంత పోట్లాట, అశాంతిలో కూడా వీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఈ బంధం ఇద్దరినీ శారీరకం గా మానసికంగా అలసిపోయేటట్లు చేస్తుంది, కానీ వీరిరువురి ఆకర్షణ ఫలితంగా అందులోనుండి బయటకు రాలేరు.
ఆధిపత్య: ఈ బంధం లో ఒకరు ఆధిపత్య ధోరణిలోనూ మరొకరు లొంగుబాటు ధోరణిలోనూ ఉంటారు. ఎవరైతే ఆధిపత్య ధోరణిలో ఉంటారో, వారి మాటే చెల్లుతుంది, వారి ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. సర్దుకుంటున్న వారికి కనీసం తాము మరీ ప్రతి దానికీ తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూడా అంగీకరిస్తున్నాం, అన్న ఆలోచన కూడా రానంత బాగా ఆధిపత్య ధోరణి ఉన్న వారు కంట్రోల్ చేస్తారు. సర్దుకుంటున్న వారు రెండవ వారిని ఏమైనా అడగాలన్నా కూడా సంకోచించేంత లెవెల్ లో ఈ కంట్రోల్ ఉంటుంది. ఈ బంధం లో ఉన్న కనిపించని హింస బయటి వారికి అర్ధమవుతుంది కానీ లోపల లొంగి ఉన్న వారికి అర్ధం కాదు.