ఒకప్పుడు ఈ వంజంగి గ్రామం, పక్కనే ఉన్న కల్లాలబయలు అనే గిరిజన గ్రామాలకి చెందిన పశువుల కాపరులు మాత్రమే ఈ కొండపైకి వస్తుండేవారు. 2020లో వంజంగి-కొత్తవలస మధ్యలో తారు రోడ్డు పడటంతో విశాఖవాసులు కొందరు ఇటువైపు వచ్చి కొండెక్కడం మొదలుపెట్టారు. వచ్చిన ఆ ఒకరిద్దరు ఈ ప్రాంతం విశేషాలని సోషల్ మీడియాలో పంచుకోవడంతో... మెల్లగా పర్యటకుల రాక మొదలైంది. అలా వచ్చిన వారంతా అక్కడి మంచు అందాలను చూసి పరవశించిపోయారు.