ఆర్టీసీ బస్సులు నడిపితే కరోనా వ్యాపిస్తుందా..?: అనంత వాసుల షాకింగ్ తీర్పు

4757చూసినవారు
ఆర్టీసీ బస్సులు నడిపితే కరోనా వ్యాపిస్తుందా..?: అనంత వాసుల షాకింగ్ తీర్పు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే అవకాశముందని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో డిపోలకే పరిమితమైన బస్సులు ఈనెల 18 నుంచి రోడ్డెక్కించేందుకు ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత దూరం పాటించాల్సిన అవసరం ఉన్నందున సీటింగ్‌ కెపాసిటీని సగానికి తగ్గించడంతోపాటు టికెట్‌ ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే చార్జీలను పెంచే ఆలోచన లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అయితే ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతులు ఇస్తే కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై లోకల్ యాప్ సర్వే నిర్వహించింది.

అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 84.23శాతం మంది బస్సులు నడిపేందుకు అవకాశం ఇస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.15.77శాతం మంది మాత్రం బస్సులు నడపడం వల్ల కరోనా వ్యాప్తి చెందదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధిక శాతం రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తే ఖచ్చితంగా వైరస్ మరింత విజృంభిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రజా రవాణాకు అనుమతులు ఇస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.