ఏరులై పారుతున్న నాటుసారా

9922చూసినవారు
ఏరులై పారుతున్న నాటుసారా
కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సుండుపల్లి మండలాలతో పాటు చిత్తూరు జిల్లా కె. వి పల్లి మండలాల పరిసర ప్రాంతాలనుంచి సారాను విక్రయదారులు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే జిల్లాలోని సుండుపల్లి మండలంలో గుండ్లపల్లి, మాచిరెడ్డిగారిపల్లి, ముడంపాడు, కుంటలముందర ప్రాంతాలతో పాటు స్థానిక మండల కేంద్రంలో సైతం సారా విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

అంతే కాకుండా సంబేపల్లి వీరబల్లి మండలాలకు సైతం సారా రవాణా జరుగుతోందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యనిషేధం లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంటే అదే అదునుగా భావించిన కొందరు విచ్చలవిడిగా తయారుచేసి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో సారా బట్టీలు మండుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఊట ను నిల్వ చేసి సారా తయారు చేస్తున్నారు. మండలంలో పలు గ్రామ పంచాయతీలు సారా అమ్మకానికి కేంద్రంగా మారాయి. పల్లెల్లో సారా ప్యాకెట్లు పుట్టుకొస్తున్నాయి.

మండల కేంద్రంలో సైతం సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని పల్లెల్లో సారా చిచ్చు రేపుతోంది. సారాయి తాగి చాలామంది ఇంట్లో ఆడవాళ్లను వేధిస్తున్నారు. గతంలో సారాయి నిర్మూలనకు ప్రభుత్వ అధికారులు చేసిన ఫలితాలు ఇసుకలో పోసిన పన్నీరు అయింది. అంతేకాకుండా గతంలో అధికారులు నిర్లక్ష్యం వలన సారా విచ్చలవిడిగా తయారవుతోందని జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు అనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇకనైనా అధికారులు శ్రద్ధ చూపి సారా నిర్మూలనకు బాటలు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్