ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్..కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

19813చూసినవారు
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్..కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. ఓర్వకల్ విమానాశ్రయానికి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్చి నుంచి విమాన రాకపోకలకు అనుమతులు మంజూరు చేస్తూ జనవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది మార్చి నెల నుంచే రాకపోకలను ప్రారంభిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం 2020లోనే సీఎం జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

ముఖ్యంగా విమానాశ్రయం అనుమతులు రావడంతో సుదూర ప్రయాణం సులువుగా సాగనుందన్నారు. విశాఖ సహా ఇతర ముఖ్య నగరాలకు త్వరగా చేరుకోవచ్చని మంత్రి మేకపాటి తెలిపారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తవడం ఒక ఎత్తైతే..దానికి వేగంగా అనుమతులు తీసుకురావడం మరో కీలక ముందడుగని మంత్రి అభివర్ణించారు. ఎరొడ్రమ్ లైసెన్స్ అనుమతులు రావడం వెనుక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీఏడీసీ ఎండీ వీఎన్ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ సహా ప్రతి ఒక్కరి కృషినీ ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.

ఇప్పటికే నైట్ ల్యాండింగ్ సిస్టమ్, పైలట్ ట్రైనింగ్ సెంటర్ వంటి ఏర్పాట్లకూ కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా కీలకమైన లైసెన్స్ తీసుకురావడం పట్ల ఏపీఏడీసీ ఎండీ భరత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

కర్నూలుకు 18కిలో మీటర్ల దూరంలోని ఓర్వకల్లులో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు సంకల్పించింది. 640 ఎకరాల్లో నిర్మించిన ఎయిర్ పోర్టుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత మూడేళల్లో టెర్మినల్ నిర్మాణం పూర్తైంది. కానీ ఎయిరో డ్రోమ్ అనుమతులు మాత్రం రాలేదు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2020లోనే 150 కోట్లు ఖర్చు చేసి రన్ వే, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసింది. ఈనేపథ్యంలో నెల రోజుల క్రితం డీజీసీఏ అధికారులు ఎయిర్ పోర్టును పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. నివేదికను పరిశీలించిన తర్వాత ఎయిరోడ్రోమ్ అనుమతులు మంజూరు చేశారు. డీజీసీఏ అనుమతులు రావడంతో మరో రెండు మూడు నెలల్లో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్