అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతి పెద్ద స్కామ్ అని మేము ముందునుంచి చెప్తున్నామన్నారు. బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందన్నారు. త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయన్నారు. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.
ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ వెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు. మీరు తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ కోరాలని టీడీపీని డిమాండ్ చేశారు. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదన్నారు. ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలన్నారు. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్లేనన్నారు. డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరమని.. న్యాయస్థానలపై తమకు గౌరవం ఉందన్నారు.