కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ జిల్లాపై విరుచుకుపడుతోంది. జిల్లాలో పదుల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన కలుగుతుంది. గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో మరో 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దాంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 343కు పెరిగాయి. ఇకపోతే ఇప్పటి వరకు జిల్లాలో 9మంది కరోనా బారినపడి మృత్యువాత పడగా 43మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 291మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక కోవిడ్ -19 కేసులు నమోదైన జిల్లాగా మెుదటి స్థానంలో నిలిచింది. 343 కేసులతో ఏపీలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాగా కర్నూలు ఉంది. మెుత్తానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇకపోతే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332కు చేరుకున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 73 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 1332కు చేరుకున్నాయి. అయితే వారిలో 287మంది డిశ్చార్జ్ కాగా 31 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1014 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే గడచిన 24 గంటల్లో 7727 సాంపిల్స్ ను పరీక్షించగా వాటిలో 73 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.