తర్లుపాడు రోడ్డులోని సాయి డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం ద్వితీయ మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ సభకు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి.ఈశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీతారామశాస్త్రీ వైద్యశాల వైద్యులు డాక్టర్ సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థపై నిరంకుశ దాడిని, దుష్ట పన్నాగాలను ముక్తకంఠంతో విద్యార్థిలోకం ఎదిరించాలన్నారు. మాతృభాషలో విద్యాబోధన శాస్త్రీయమైనదన్నారు. నిర్బంధ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని సమాంతరంగా కొనసాగించాలన్నారు. బడ్జెట్ లో విద్యారంగానికి 8 శాతం నిధులు కేటాయించాలన్నారు. నూతన విద్యా విధానంలో లోపాలు ఉన్నాయని, వాటి స్థానంలో ప్రజాతంత్ర విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి భగవాన్ దాస్ మాట్లాడుతూ.. జెఎన్టీయూ విద్యార్థులపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలన్నారు. పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఖండిస్తున్నామన్నారు. నేటి చదువులు ధనార్జన కోసమే ఉన్నాయని, అలా కాకుండా సమాజ అభివృద్ధికి పాటుపడేలా విద్య ఉండాలన్నారు. ట్రినిటీ ఒకేషనల్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కే.నవీన్ చంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జన విజ్ఞాన వేదిక నాయకులు ఏనుగుల రవికుమార్, గోరంట్ల చిన్నవెంకటరెడ్డి, యస్.సుబ్బయ్య, సిఐటియు నాయకులు డీకేఎం రఫీ, డివైఎఫ్ఐ నాయకులు ఏనుగుల సురేష్ కుమార్, కొండయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు లోకేష్, నాని ,విష్ణు, ఏనుగుల శివ, గణేష్, నాగేంద్ర , నారాయణ,చెన్నయ్య, మనోహర్, అంజి తదితరులు పాల్గొన్నారు.