20వ శతాబ్దంలో పెద్ద విపత్తు దివిసీమ ఉప్పెన

19471చూసినవారు
20వ శతాబ్దంలో పెద్ద విపత్తు దివిసీమ ఉప్పెన
బంగాళాఖాతంలో వాయుగుండం పడింది అంటే చాలు దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. 1977 నవంబర్ 19న జరిగిన ఓ విషాద సంఘటన గుర్తు చేసుకుని కుమిలిపోతుంటారు. సముద్రపు అలలు ఉన్నట్టుండి తాటిచెట్టంత ఎత్తున ఎగిసి విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను శవాల గుట్టలుగా మార్చాయి. ఆ విషాదకర సంఘటన జరిగి సరిగ్గా నేటికి 43 ఏళ్లు అవుతున్న సందర్భంగా లోకల్ యాప్ పాఠకుల కోసం ప్రత్యేక కథనం...

1977 నవంబర్ 19 శనివారం తుఫాను వర్షం కురుస్తుంది. ఎప్పటిలాగే తీరం దాటుతుంది అని దివిసీమ ప్రజలు నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రిని కాళరాత్రిగా మారుస్తూ ఒక్కసారి ప్రళయం ముంచెత్తింది. సముద్రపు హోరు సుమారు 30 మీటర్ల ఎత్తున ఎగిసి రాకాసి అలలు గ్రామాలపై పడి తన ప్రతాపం చూపించిన కొద్ది నిమిషాల్లోనే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకు పోగా.. పదివేల మందికిపైగా ప్రజలు అసువులు బాశారు. వేలాది పశువులు సంతతి మృత్యువాత పడ్డాయి. కోట్లాది రూపాయల విలువగల ఆస్తి నష్టం జరిగింది. నాగాయలంక, కోడూరు మండల తీరప్రాంత గ్రామాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే.

కూలిపోయిన ఇళ్లు, చెట్లు, కళ్ళముందే మనుషుల్ని, పశువుల్ని తాడిచెట్ల ఎత్తంత పరిణామానికి ఎగురవేస్తూ అతి భయంకరమైన విలయతాండవం సృష్టించింది. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, ఇరాలి, గొల్లపాలెం, బసవనిపాలెం, ఊటగుండం,నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సోర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ తదితర మత్సకార ప్రాంతాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

సుమారు 33 లక్షల ఎకరాలలో పంటనష్టం వాటిల్లింది, ఉప్పెన ప్రభావానికి దివిసీమ లో 10,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల అంచనా అయితే లెక్కకు తెలీకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్ని వేలో తెలీదు. ఒక్క నాగాయలంక మండలంలోని సోర్లగొంది గ్రామంలో 714 మంది, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెం లో 161 మంది చనిపోయినట్లు అధికారుల అంచనా.

ఆనాటి రోజుల లెక్కల ప్రకారం 172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మత్సకారుల వలలు, పడవలు సైతం గల్లంతయ్యాయి. ఎన్నో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. చిమ్మ చీకట్లో వరద ఉధృతి విరుచుకు పడటంతో అనేకమంది కొట్టుకుపోతూ తుమ్మ, ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం విరుచుకుని పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విల్లులా వంగిపోయాయి.

400 మందిని కాపాడిన ‘వేణుగోపాలుడు’
ఉప్పెన ప్రభావం కృష్ణా జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోనూ కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు దెబ్బతిన్నాయి. హంసలదీవిలో శ్రీరుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఈ విపత్తు నుంచి 400 మందిని రక్షించింది. ఆ రోజు మధ్యాహ్నం వాతావరణం మారిపోవటం మొదలైంది. దీంతో ప్రజలు ఆ గుడిలో ఆశ్రయం పొందారు. సముద్రంలో ఉప్పొంగిన అలలతో ఊళ్లకుఊళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయినా ఈ ఆలయంలోకి చుక్క నీరు కూడా రాలేదు. దివిసీమ ఉప్పెన ఆంధ్రప్రదేశ్​ అంతటినీ వారం రోజుల పాటు కుదిపేసింది. నవంబర్ 14 నుంచి 22 వరకు ఎడతెరిపి లేకుండా వీచిన చలిగాలులు, కుండపోతలా కురిసిన వర్షం జనజీవనాన్ని స్థంబింపచేసింది.

నవంబర్ 21వ తేదీ సోమవారం రాష్త్ర ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ప్రకటించింది.బియ్యం, పాలు, బ్రెడ్ తదితర నిత్యావసరాలు పెద్ద ఎత్తున చేరుకొన్నప్పటకి ఎన్నో గ్రామాలకు చేరుకొనేందుకు రవాణా సౌకర్యం లేదు. దీంతో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎం.ఐ.-4 హెలికాఫ్టర్ రంగంలోకి దిగాయి. 150 మీటర్ల ఎత్తు నుంచి ఆహార పొట్లాలు ..నీటి ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేశారు. హెలికాఫ్టర్ నేలపై దిగేందుకు సరైన ప్రాంతం కూడా లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఉప్పెన తీవ్రతకు దివిసీమలో ముళ్ళకంపల్లో చిక్కుకొని వందల సంఖ్యలో నాడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిని వెలుపలకు తీసే పరిస్థితులు లేకపోవడంతో వివిధ హత్యా నేరాలలో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షలు అనుభవిస్తున్న 50 మంది కరుడుకట్టిన నేరస్తులను దివిసీమకు తరలించారు. వారిని శవ దహనాలకు ఉపయోగించారు. వారు ముక్కు మూతులకు జేబురుమాళ్ళు కట్టుకొని తుమ్మ చెట్లలలో దూరి కుళ్ళి దుర్వాసన కొడుతున్న మృతదేహాలను మోసుకొంటూ వెలుపలకు తీసుకువచ్చి సామూహిక దహనాలు నిర్వహించారు. నాడు ఖైదీల అమూల్య సేవల కారణంగా తీర ప్రాంతాలలో భీతావహ వాతావరణం తొలిగిపొయింది.

ఉప్పెన అనంతరం వివిధ కమ్యూనికేషన్స్ పునరుద్దరణకు ఎంతో కాలం పట్టింది. అధికారులు వైర్ లెస్ సెట్ల సహాయంతో పునరావాస పనులు చక చకా నిర్వహించారు. ఆర్మీ ఇంజినీర్లు పెద్ద డీజిల్ మోటార్ల సహాయంతో చెరువులలో చేరిన సముద్రం నీటిని వెలుపలకు పంపించారు. వివిధ గ్రామాలలో తాగునీటి అవసరాలకు ఎన్నో బోర్ పంపులు ఏర్పాటుచేశారు. కలరా తదితర అంటువ్యాధులు ప్రబలకుండా ఆర్మీ డాక్టర్లు ప్రజలకు వ్యాధి నిరోధక టీకాలు.. మందులు పంపిణీ చేశారు. ఇక ఈ ఘోర ఉప్పెన ధాటికి బలైపోయిన ప్రజల దుస్థితికి చలించిపోయిన ఎన్నో ప్రపంచ దేశాలు పెద్ద మనస్సుతో స్పందించాయి.

నాటి ప్రళయానికి ప్రపంచ దేశాలు సైతం చెలించిపోయాయి. అమెరికా , బ్రిటన్ , వెస్ట్ జర్మనీ , కెనడా , శ్రీలంక తదితర దేశాలు పెద్దఎత్తున సహాయపడ్డాయి. పాకిస్తాన్ సైతం రూ.15 లక్షల విలువ చేసే తక్షణమే నిర్మించుకునేలాంటి పెద్ద గుడారాలను మన ప్రాంతానికి పంపింది. బంగ్లాదేశ్ వైద్య బృందాన్ని పంపింది. ఇక ప్రపంచంలోని పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సహాయపడేందుకు ముందుకొచ్చాయి. రెడ్ క్రాస్, ఆక్స్ఫామ్ అండ్ కేర్ వంటి సంస్థలు బాధితుల వద్దకు నేరుగా చేరుకొన్నాయి. తమవారిని పోగొట్టుకొని వేలాదిమంది రైతులు,మత్య్సకారులు, నేతపనివారు తిరిగి గ్రామాలలో అడుగుపెట్టేందుకు తమ తమ వృత్తులు తిరిగి కొనసాగేందుకు ఎంతో జంకారు.


దివిసీమ గాంధీగా పేరుపొందిన ఆనాటి శాసనసభ్యులు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలిచారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో అన్నార్తులకు ఆయన చేసిన సేవలు, కానీ దివిసీమ పునఃనిర్మాణంలో కాని మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన సేవలు చిరస్మరణీయం. నాటి ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కేంద్ర మంత్రి వాజ్ పేయి, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ), అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ సువార్తికులు బిల్లీ గ్రహం తదితరులు విచ్చేసి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాలు సైతం అదే విధంగా నిర్వహించారు.

నవంబర్‌ 19 వస్తుందంటేనే దివి సీమ ప్రజలకు వణుకు పుడుతుంది. నాటి నుండి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుబండి సాగించారు దివిసీమ వాసులు. తర్వాత పుంజుకున్న దివిసీమ రతనాలను పండిస్తున్న భాగ్యసీమగా మారింది. దివిసీమ అన్నపూర్ణ మాత్రమే కాదు భక్తిభావానికి పుట్టినిల్లుగా విరాజిల్లుతూ ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను తన వడిలో ఉంచుకున్న పవిత్రభూమి. ఎంతో మంది మేధావులకు, మహాత్ములకు, దేశభక్తులకు,కళాకారులకు జన్మనిచ్చిన పవిత్రసీమ దివిసీమ. 1977 ఉప్పెన తర్వాత మానవతావాదుల సహకారంతో తిరిగి ఊపిరి పోసుకుని సుస్థిర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన దివిసీమకు నేటితో 43 ఏళ్ళు పూర్తయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్