‘బోనాలమ్మ కొండలపై ప్లాస్టిక్ వ్యర్ధాల నివారణకు చర్యలు చేపట్టండి‘

1031చూసినవారు
‘బోనాలమ్మ కొండలపై ప్లాస్టిక్ వ్యర్ధాల నివారణకు చర్యలు చేపట్టండి‘
సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు స్వర్గధామంగా ప్రసిద్ది చెంది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వంజంగి హిల్స్ బోనాలమ్మ కొండ (మేఘల కొండ)పై పేరుకుపోతున్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు తక్షణమే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, వినియోగించిన కండోమ్స్ ఆదివాసుల వ్యవసాయ భూముల్లో, కాఫీ, మిరియాలు తోటల్లో విచ్చల విడిగా వదిలి వెళుతున్నారని, ఆ వ్యర్థాల నిర్వహణకు ఐటీడీఏ, అటవీ శాఖ, గ్రామ పంచాయతీ అధికారులు ఏవిధమైన చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండ ప్రాంతాల ఆదివాసీ గ్రామాలకు కనీస రహదారి నిర్మాణాలకు సైతం అడ్డుపడుతున్న అటవీశాఖ వంజంగి హిల్స్ పై టూరిజం డెవలప్మెంట్ పెరిటా ప్రత్యేక రోడ్డును ఏ విధంగా నిర్మించారని రామారావు దొర ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ద్వారా హక్కు పత్రాలు పొంది ఆదివాసులు ప్రకృతి (పోడు) వ్యవసాయం, కాఫీ, మిరియాలు పంటలు పండిస్తున్నారని, పర్యాటకులు విచక్షణ రహితంగా పంటచేలను ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేస్తున్నా ఆ వ్యర్థాలు నిర్వహణకు అవసరమైన డస్ట్ బిన్స్ నైన ఏర్పాటుచేయుటకు ఐటిడిఎ, అటవీ శాఖల, పంచాయితీ అధికారులు చొరవ తీసుకొకపోవడం వారి పనితీరుకు నిదర్శనమని అన్నారు. పర్యాటకులు కొండపైకి తీసుకెళ్ళి తినగ మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని వంజంగీ, కల్లబయలు, ఎస్ కొత్తూరు గ్రామల రైతులకు చెందిన పశువులు, గొర్రెలు, మేకలు మరణిస్తున్నాయని, పిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరని అన్నారు.

ఒంటరి రైతులు, మహిళా రైతులు కొండపైకి మునుపటి లాగా వ్యవసాయ పనులు చేసుకో లేకపోతున్నరని, కొండపై రాత్రి బస చేసిన పర్యాటకులు కాఫీ, మిరియాల తోటలు, ఊట సెలమల వద్దనే మల, మూత్ర విసర్జన, వ్యర్థాలు వదిలి వెళుతున్నారు. పర్యాటకుల అరుపులు, కేకలు, వాహనాల రద్దీ, శ్రుతిమించిన ప్రవర్తనలకు భయపడి వ్యవసాయ పనులకు, పంట సేకరణకు అటువైపు వెళ్ళలేక పోతున్నట్టు రైతులు జేఏసి దృష్టికి తెచ్చారని, సంబంధిత అధికారులు, పోలిసులు వెంటనే చర్యలు చేపట్టాలని రామారావు దొర డిమాండ్ చేశారు.

ప్లాస్టిక్ వ్యర్ధాలు సమస్య వంజంగి హిల్స్ మాత్రమే పరిమితం  కాదని, ఏజెన్సీ వ్యాప్తంగా  అరకులోయ, అనంతగిరి, లంబసింగి, కొత్తపల్లి జలపాతం మొదలైన ఆన్ని చోట్ల ఇదే దుస్థితి నెలకొందని, ప్లాస్టిక్ వ్యర్ధాల నివారణకు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని రామరావు దొర హెచ్చరించారు. ముఖ్య సలహాదారులు సొనాయి గంగరాజు, కో కన్వీనర్స్ జవ్వది సూర్యనారాయణ, బూడిదే సుమన్, మాధవ్, కిషోర్ బాబ్జి మనుగురు, నానిబాబు, వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్