దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్‌ను సింపుల్‌గా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు చూపించాడు. బోర్లా పడుకొని ఛాతీపై బరువు వేసి బలంగా ఊపిరి పీల్చి వదలడం వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతున్నట్లు పల్స్ ఆక్సీమీటర్ చూపిస్తూ మరీ వివరించాడు.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అసలు ఇది నిజమేనా? కరోనా పేషెంట్లు ఇలా చేసి ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవచ్చా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
ఇది పాత టెక్నిక్ కె .. ఆ వీడియోలో ఆ వ్యక్తి చెబుతున్నట్లు ఇలా చేస్తే ఆక్సిజన్ లెవల్స్ పెరగడం చాలా మందికి కొత్తగా అనిపిస్తోంది కానీ ఇది చాలా పాత పద్ధతే. ఛాతీ, పొట్టపై బరువు వేసి లేదంటే పక్కకు పడుకొని ఊపిరి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు మొత్తానికీ ఆక్సిజన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే ప్రోనింగ్ పొజిషన్ అంటారు.
తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లలో ఇది మంచి ఫలితాలు చూపించినట్లు అధ్యయనాలు తేల్చాయి. 2002లో యురోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురించిన దాని ప్రకారం ఇది ఆక్సిజనేషన్‌ను పెంచడానికి ఒక సాధారణ, సురక్షితమైన పద్ధతి.
అధ్యయనం ఏం చెబుతోంది?
ప్రోన్ పొజిషన్ అనేది ఆక్సిజనేషన్‌ను పెంచడానికి ఓ మార్గం. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల ప్రారంభ దశలో ఉన్న పేషెంట్లలో 70 నుంచి 80 శాతం మందిలో ఆక్సిజనేషన్ పెరిగినట్లు అధ్యయనాలు నిరూపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చేసిన అవేక్ ప్రోనింగ్ అనే అధ్యయనంలోను ఇదే తేలింది.
ప్రోనింగ్ అనేది చాలా మంది పేషెంట్లలో కృత్రిమ వెంటిలేషన్ అవసరాన్ని ఆలస్యం చేస్తుందని గుర్తించారు. అటు ఫోర్టిస్ మెమొరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా కూడా ఈ ప్రోనింగ్ పొజిషన్ ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుందని స్పష్టం చేశారు.
ఆక్సిజన్ లెవల్స్ ఎంత ఉండాలి?
కరోనా వచ్చినప్పటి నుంచీ చాలా మంది ఇళ్లలో పల్స్ ఆక్సీమీటర్లు ఉంటున్నాయి. వాటి ద్వారా తమ రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను చూసుకుంటున్నారు. 95 లోపు వస్తే చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఆక్సిజన్ కోసం పరుగులు పెడుతున్నారు.
కానీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా ప్రకారం. ఆక్సిజన్ స్థాయిలు 93 నుంచి 98 మధ్య ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుకోవడానికి చాలా మంది ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లను పెట్టుకొని మరీ పిలుస్తున్నారని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదంతోపాటు నిజంగా అవసరం ఉన్న వాళ్లకు ఆక్సిజన్ దక్కకుండా పోతుందని రణ్‌దీప్ గులేరియా అన్నారు.
ఆక్సిజన్ లెవల్స్ 92 నుంచి 94 మధ్య ఉన్న వాళ్లు అధిక స్థాయిలో ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు. 94 లోపు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి తప్ప కచ్చితంగా ఆక్సిజన్ అవసరం అవుతుందని కాదు. మధ్యమధ్యలో ఓ గంట, రెండు గంటలు ఆక్సిజన్ తీసుకొని సాచురేషన్ లెవల్స్ పెంచుకోవడం వల్ల ప్రయోజనం లేదు. 92-94 మధ్య ఉంటే భయపడకుండా ముందుగా డాక్టర్‌ను కలవండి అని గులేరియా స్పష్టం చేశారు.