వినాయక చవితి రోజున తెల్లవారుజామునే మేల్కొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం తల స్నానం చేసి, ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కట్టి, పూలమాలతో అలంకరించుకోవాలి. ఇక ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తామరాకును పెట్టి వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం గణేశ షోడశ నామాలతో పూజించాలి. తర్వాత పూవులు, అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో విఘ్నేశ్వరుడిని అర్చించాలి.