మళ్లీ జన్మ ఉంటే నీ కోసమే పుడుతా నయన

202091చూసినవారు
మళ్లీ జన్మ ఉంటే నీ కోసమే పుడుతా నయన
మనం ఎన్ని లేఖలు రాసుకున్నా...పై వాడు రాసిన గీతలు మార్చలేం అంటారు...ప్రేమలో కూడా అంతే...మనిషి చనిపోయినా ప్రేమ మాత్రం చావదు అంటారు..కానీ నేడు పరుగులు పెడుతున్న ఈ బానిస ప్రపంచంలో ప్రేమ అనే పదం కేవలం రెండు అక్షరాలుగా మిగిలిపోయింది. కానీ నా జీవితంలో ప్రేమ అనేది ఒక మరిచిపోలేని గతం...గతం మళ్ళీ రాదని అంటారు..కానీ ఆ నాటి గాయాలే... నేడు శాపాలై చంపుతున్నాయి. గతంలో జరిగిన ప్రతిక్షణం గుర్తొచ్చి ముల్లులా ఎందుకు గుచ్చుతుందో అర్థం కావడం లేదు. నిన్ను చూశాక మొదలైన ఈ ప్రేమ నాతోనే ఆగిపోతుంది. గాలి మళ్ళినా గమ్యం మాత్రం ఒకటే ఉంటుంది..ఇది పై వాడు గీసిన గీత కాదు..నేను రాసిన రాత...

ఇప్పటి వరకు తన ముందుకు వెళ్లి ప్రేమిస్తున్న అని చెప్పలేకపోయా...నాకు అంత అవకాశం కూడా రాలేదు. తనకు చెప్పాలి అనుకున్న ప్రతిసారి నా గుండె శబ్దం నాకే వినిపిస్తుంది. ఏసీ రూమ్ లో ఉన్నా చెమటలతో స్నానం చేసేస్తాను. ఎప్పుడు వాగుతూ ఉండే నా గొంతు కూడా మూగదవుతుంది. నేను చేసే ఈ ప్రయాణం ఎక్కడైనా ఆగిపోవచ్చు. ఎప్పుడైనా ఆగిపోవచ్చు. కానీ నా ప్రయాణం ఆగిపోయే ముందు చివరిసారైనా నేను తనతో చెప్పలేకపోయిన మాటలు చెప్పాలి అని కోరుకుంటా...కొన్ని విషయాలు చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తున్నా. పుస్తకంలో రాద్దామా అంటే నాది అంత పెద్ద కథ కాదు..సరే లేఖలో రాసిద్దామా అంటే మరి అంత చిన్న కథ కూడా కాదాయే...

నేను చేసిన 25 ఏళ్ళ ప్రయాణంలో నాకు తెలిసి నేను చేసిన పనులు చాలా తక్కువ. ఇందులో 3 ఏళ్ళు నయన కోసం తిరిగిన ప్రతిక్షణం మాత్రం నేను మర్చిపోలేను..మర్చిపోను కూడా... నయన...నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న అమ్మాయి. తనను చూసిన మొదటి చూపులోనే ప్రేమించడం మొదలు పెట్టా. అందరు అంటారు ప్రేమ పుట్టాడానికి కారణాలు ఉండవని... శివుడి ఆజ్ఞా లేనిదే చీమ కూడా కుట్టదంటారు..కానీ ఏ కారణం లేకుండా ఆ అమ్మాయి నాకు నచ్చింది అంటే అది పిచ్చే అవుతుంది. తన కళ్ళు.. తన అందం... కేవలం ఈ రెండు ప్రతిక్షణం నేను తనను చూసేలా చేశాయి. నేను ఎక్కడున్నా ఆకర్షించాయి..నన్ను తన ప్రేమలో పడేశాయి.

తన పేరు నయన...నేను తనని మొదటిసారి 2013 లో చూశాను. అప్పుడే బీటెక్ లో చేరాను. నయన మా క్లాస్ మేట్. చూసిన వెంటనే నచ్చేసింది. వెంటనే అమ్మాయికి చెప్పాలి అనుకున్నా. కానీ అందరిలా చెప్పకూడదు అని టైం తీసుకుందాం అనుకున్నా. ఒక పుస్తకం మొత్తం తన పేరుతో నింపేసా. మంచి సమయం చూసి ఇద్దాం అనుకున్నా....కానీ విధి ఆడే వింత నాటకాన్ని మనం ఆపలేం కదా. నేను ఆ పుస్తకం ఇవ్వకముందే ఆ పుస్తకం ఆ అమ్మాయికి చేరింది. నా బ్యాగ్ లో నుంచి తీసుకొని వేరే అతను ఇచ్చేసాడు. నేను చెప్పకుండానే నా ప్రేమ గురించి ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఆ అమ్మాయికి ఏంటి కాలేజీ మొత్తానికి తెలిసిపోయింది. అప్పటి నుంచి నేను అమ్మాయితో మాట్లాడలేకపోయా...వద్దన్నా వెంటపడేవాడిని. బుక్ ఎఫెక్ట్ నా పై చాలా పడింది. ఆ పుస్తకానం నిండా పేరుతో పాటు కవిత్వాలు రాసాను. అనుకున్నది అనుకున్నట్టు జరిగింటే పరిస్థితి ఎలా ఉండేదో, ఏం జరిగేదో, చిన్నగా సమయం చూసి అర్థం అయ్యేలా చెప్పింటే ఇప్పటికి మా పెళ్లి అయ్యుండేదేమో....ఇలా ఎన్నో ఆశలు, ఊహలు నన్ను చంపేసేవి. జరిగేదానికన్నా నేను ఊహించిందే ఎక్కువ. ఎంతైనా సినిమా పిచోడిని కదా...పైగా మాటల మాంత్రికుడి అభిమానిని....అలాంటప్పుడు ఊహలు తారాస్థాయిలోనే ఉంటాయి.

కాలేజికి వస్తే ముందు నా కళ్ళు తననే వెతికేవి. తను ఆటోలో వస్తే నేను కూడా కావాలని అదే ఆటోలో వచ్చేవాడిని. కానీ మాట్లాడేవాడిని కాదు. భయం వేసేది. ఒకవేళ తను కాలేజీకి రాకపోతే నేను కూడా కాలేజీకి వెళ్లిపోయేవాడిని కాదు. తను 2 ఏళ్ళ తరువాత కాలేజీ మారింది..కానీ నా తీరు మాత్రం మారలేదు..తరువాత నేను నా పని చూసుకుంటూనే నయనను చూడడానికి వెళ్ళేవాడిని.

2017... నేను ఇంట్లోనుంచి బయటికి వచ్చేసాను. ఏదో సాదిద్దాం అని బయల్దేరాను. ప్రేమ అన్నం పెట్టదు కదా....ఎదో ఒకటి చేయాలి కదా....అక్కడి నుంచి డబ్బుకోసం పరిగెత్తాను..ఏ చిన్న పనైనా చేయడం మొదలుపెట్టా. ఎన్ని పనులు ఉన్నా తనను మాత్రం చూసేవాడిని. నవంబర్ 22 తన బర్త్ డే.. ఎలాగైనా కలిసి మాట్లాడాలి అనుకున్నా. అప్పుడు అజయ్ తో మాట్లాడి ఎలాగైనా బర్త్ డే గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశా. అజయ్ కూడా సరే అనడంతో భారీ ప్లాన్ చేసాం. నయన అజయ్ కి బాగా తెలుసు..బెస్ట్ ఫ్రెండ్ కూడా కావడంతో అజయ్ కాల్ చేయగానే రావడానికి ఒప్పుకుంది. ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు.

మొదటిసారి నేను నయనతో కలిసి ఆ రోజు డిన్నర్ చేశాను. తనకు మేము ఇచ్చిన సర్ ప్రైజ్ కూడా బాగా నచ్చింది. తరువాత తనని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వచ్చాం. ఇంక ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. జరిగిందంతా కలలా అనిపించింది. తరువాత మళ్ళీ ఒకసారి తనను కలిశాను. కాలేజీ పని మీద అనంతపూర్ కి వెళ్లాల్సి వచ్చింది. తనతో 3 గంటలు ప్రయాణం చేశాను. సాయంత్రం వరకు నయనతోనే ఉన్నాను. అనంతపూర్ కి చేసిన ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. తరువాత తనని వాళ్ళ ఊరు బస్సు ఎక్కించి మేము మా ఉరికి వచ్చేసాం.

ఆ తరువాత నేను ఊరు వదిలి బయటికి వచ్చాను. మధ్యలో మళ్ళీ ఒకసారి అడిగాను. నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను నువ్వు ఒప్పుకుంటే అని..కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పింది. తరువాత నేను కూడా మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. కానీ తను ఒప్పుకుంటే నేనైతే వెంటనే పెళ్లి చేసుకుంటాను... తను ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనని కలువలేదు. కానీ నా నమ్మకం అయితే మారటం లేదు.

2015 నుంచి నేను చాలా కోల్పోయాను. కోరుకున్న ఒక్కపని కాలేదు. నయనను ఎలాగో మరిచిపోలేను...అక్కడే ఉంటే ఏది సాధించలేము. గతాన్ని గుమ్మం దగ్గర వదిలేస్తేనే గమ్యాన్ని చేరగలం...ఏదైనా సాధించగలం.... అప్పటి నుంచి నా ప్రయాణం ఎక్కడా ఆగలేదు.. ఆగదు...కానీ నేను చేసే ప్రయాణంలో తనుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇది సహజమే....కానీ కాలం మనకోసం ఆగదు...అందుకే ఒకరికోసం ప్రయాణం ఆపకూడదు. నేను కూడా వీలైనంత త్వరగా గతాన్ని గుమ్మం దగ్గర వదిలివెళ్లాలి. ఎదురు చూసినంత మాత్రాన ఇప్పుడు అమ్మాయి రాదు...మరో రోజు ఉంది అంటేనే నమ్మను నేను...ఇక మరో జన్మలో ఆ అమ్మాయికోసం పుడతాను అంటే అది పిచ్చే అవుతుంది. నేను చేసే ఈ ప్రయాణంలో నువ్వు లేకపోయినా....నేను కోరుకునేది ఒక్కటే...తన సంతోషం...నయన నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలి.. నాకు అదే కావాలి.


ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకునే మహ్మద్ రఫీ



"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్