ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. శనివారం కంది మండలంలోని కంది, చెర్యాల, కవలంపేట గ్రామాల్లో అక్రమంగా నిర్మించిన ఇంటి నిర్మాణాలు, షాపులను జిల్లా స్థాయి అధికారుల బృందం కూల్చి వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణాల కోసం తప్పని సరిగా అనుమతులు తీసుకుకోవాలని, త్వరగా అందించేందుకు బీ -పాస్ విధానాన్ని తీసుకువచ్చింది. కానీ కొందరు అక్రమార్కులు ఇదేమీ పట్టకుండా తమను ఎవరేమి చేస్తారులే అనే ధీమాతో యథేచ్ఛగా చేపడుతున్నారు. ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే తప్పని సరిగా హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకోవాలి. పటాన్‌చెరు, కంది, సంగారెడ్డి మండలాలను గతంలోనే అధికారులు హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులు, ‘రియల్' వ్యాపారులు తమ సొంత స్థలాలు ఉన్నా కూడా అనుమతి తీసుకోవాలి. కానీ, కందిలో ఎన్‌హెచ్-65కు ఆనుకుని నిర్మాణాలు చేపట్టి షాపులు నిర్వహిస్తున్నారు. కవలంపేటలో అనుమతులు లేకుండా నిర్మాణం చేశారు. చెర్యాలలో లేఅవుట్ ఏర్పాటు చేసి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చి వేశారు.
యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు:
కంది మండలంలోని చెర్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ లే అవుట్లను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేయడమే కాకుండా జీప్లస్-1 నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులు మూడు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దని నోటీసులిచ్చినా స్పందన లేకపోవడంతోనే అధికారులు స్థానిక అధికారులను కాకుండా ఇతర ప్రాంత అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, కమిటీతో శనివారం కూల్చివేతలు చేపట్టారు. కందిలో మూడు నిర్మాణాలు, కవలంపేటలో ఒక నిర్మాణం, చెర్యాలలో 4 నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా కంది ఎంపీడీవో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమంగా లేవుట్లను ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు రియల్టర్లు అక్రమంగా లే అవుట్లను ఏర్పాటు చేసి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో బడి, గుడి, ఆటస్థలం కూడా ఉండదు. అందులో చిన్నారులు రోడ్లపైకి వచ్చి ఆటలాడుకుంటారు. దీంతో ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. వెంచర్‌లో నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 30 ఫీట్ల రోడ్లు ఉండాలి. కానీ 10 ఫీట్ల రోడ్డు మాత్రమే వదిలి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్లాట్లు కొని ఇబ్బందుల పాటు కావొద్దని ఎంపీడీవో సూచించారు.