జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన నిర్మాణంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి దేవాలయం వాస్తుశిల్పి ఆనంద్ సాయి, స్థపతి వల్లియనాగన్ లతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులు, పండితుల కోరిక మేరకు చిన జీయర్ స్వామిని కలిసి ఆలయ నిర్మాణం గురించి వివరించి, ఆహ్వానించినట్లు చెప్పారు. ఆనాడు ఆలయ నిర్మాణం వారికున్న అవకాశాల మేరకు నిర్మించడం జరిగిందని వివరించారు. అనేక రకాలుగా భక్తులు వీలైనంత వరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారని చెప్పారు.
ఆలయ నిర్మాణం ఎలా చేయవచ్చు అనే దానిపైన చిన్న జీయర్ స్వామితో చర్చించినట్లు వారు పేర్కొన్నారు. యాదాద్రి దేవాలయ వాస్తు శిల్పి ఆనంద్ ప్రత్యేకంగా యాదాద్రి ఆలయ నిర్మాణంలో నిమగ్నమై పనిచేస్తున్నారని, వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది నిర్మాణం కొరకు అంగీకరించి ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం పరిశీలించి ఏ రకంగా నిర్మాణం చేయాలని సూచనలు చేస్తరని చెప్పారు. ఈ నెల 23న చిన జీయర్ స్వామి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేస్తారని తెలిపారు. చిన జీయర్ స్వామి ఆశీస్సులతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని హంగులతో నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
ఆలయ నిర్మాణానికి 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అట్టి నిధులతో దేవాలయ రూపురేఖలు మారడంతో పాటు అన్ని సౌకర్యాలతో ఆలయాన్ని నిర్మించబోతున్నామని వారు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి ఎలా ముందుకు పోవాలి అనే దానిపై చిన్న జీయర్ స్వామి వద్ద ప్రత్యేకంగా సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు పెద్ద పీట వేస్తూ కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే సూర్యాపేట వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు పేర్కోన్నారు.
ఆలయాన్ని భానుపురి ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు దర్శించుకునే విధంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ గోపురాలు, లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గుడి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి, ఏ ఈ రాజయ్య, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాను చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, టిఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, వికాస తరంగిణి అధ్యక్షులు టి ఎస్ వి సత్యనారాయణ, గజ్జల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.