అరణ్యాన్ని ఆవరించుకున్న ఎత్తైన జలపాతం

29751చూసినవారు
అరణ్యాన్ని ఆవరించుకున్న ఎత్తైన జలపాతం
పర్యాటక ప్రదేశాల్లో చూడవలసిన ప్రదేశాలు చాల ఉంటాయి. కానీ మనస్సులో కొన్నే మేదులుతాయి. అలాంటి ప్రదేశాలు స్మరించుకుంటే ఒళ్ళు పులకిస్తుంది. ప్రపంచంలో ఎత్తైన జలపాతాలు ఎన్నో ఉంటాయి. కానీ భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ లో అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందింది. ఈ జలపాతం చుట్టూ అందమైన అడవి అత్యంత లోతులో ఉంటుంది. పై నుంచి ఆకాశ గంగాల వచ్చే నీరు చూస్తేనే మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. అదేంటో అనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఆ జలపాతంపై లోకల్ యాప్ ప్రత్యేక కథనం...

ఎత్తైన కొండల మధ్య నుండి ఉరకలు పెట్టినట్లు వయ్యారంగా వంకలు తిరుగుతూ పాల నూరుగుల జలువరుతున్న జలసవ్వడి చూస్తే మనసు పులకరిస్తుంది. శరీరమంతా మధురానుభూతులు గిలిగింతలు పెట్టి కళ్లు వెయ్యి ఓల్టుల వెలుగులతో నిండిపోతాయి. అలా వయ్యారాలు ఒలకబోస్తూ ఉరికే నీటినే జలపాతాలు అంటారు. ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్క సారి వీక్షించి వస్తే జన్మ జన్మల అలసట కూడా మాయమైపోతుంది. మరి సిటీ లైఫ్ లో పడి నవ్వడం కూడా మర్చిపోయిన మనం ఒక్క సారి జలపాతాల అందాలు చూడాలంటే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే మరి.

ఆదిలాబాదు జిల్లాలోని బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. కుంటాల పేరు వెనుక చరిత్ర చూస్తే....శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కుంతల రానురాను కుంటాలగా మారింది. జలపాతం చేరాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది. 45 అడుగుల ఎత్తు నుండి కిందికి పడే నీళ్లు వినసొంపైన శబ్దం చేస్తుంటాయి. జలపాతం కిందికి చేరుకొని జలకాలాటలలో.. కిలకిల పాటలలో కొద్దిసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు. వర్షా, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే జలపాతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జలకన్య అందాలను దూరం నుంచే ఆస్వాదించాలి. మరీ సమీపంలోకి వెళ్లకూడదు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందాలను తిలకించడానికి వచ్చి హెచ్చరికలు పాటించకుండా మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది.

దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది. హైదరాబాద్ నుండి సుమారు 250 కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఎతైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం.. ఈ జలపాతాన్ని తిలకించేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో పక్కనే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి పర్యాటకులు వస్తుంటారు. పచ్చని అడవుల మధ్య ప్రయాణిస్తూ ఎత్తైన కొండల మధ్య నుండి జాలువారుతున్న సెలయేళ్ల ను తిలకిండం అంటే రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.. కానీ తిలకించేందుకు వచ్చి జలపాతంలో పడి పలువురు మృతి చెందిన విషాద సంఘటనలు సైతం ఇక్కడ చోటు చేసుకున్నాయి. అటు కరోనా వైరస్ నేపథ్యంలో డబ్బులు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఇటీవల జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుంటాల జలపాతం తిలకించారు. జలపాతం ముందు ఫోటోలు దిగుతూ మంత్రముగ్దయలయ్యారు.

సంబంధిత పోస్ట్