స్వచ్ఛభారత్ లో తెలంగాణ మరోసారి స్వచ్ఛతను సాధించి దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని, వరసగా మూడోసారి స్వచ్ఛ భారత్ అవార్డులను దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ల మంత్రి, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ శాశన సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
స్వచ్ఛ భారత్ అవార్డుల పరంపర కొనసాగుతున్న నేపద్యంలో మంగళవారం మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా వరసగా మొదటి స్థానాన్ని దక్కించుకుంటు, జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా దేశంలో మూడో స్థానంలో నిలిచిందని, ఇదంతా ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాల విజయ పరంపర ఫలితమని,
అలాగే అవార్డులు ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందచేస్తున్నదని, తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గత ఏడాది మూడు పథకాలను కేంద్రం ప్రారంభించిందని,అందులో 2019, నవంబర్ 1 నుంచి 2020, ఏప్రిల్ 20 స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్) కార్యక్రమాన్ని, జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలు ,గ్రామాలను సమీకరించి వారి కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు, సముదాయిక్ షౌచలయ అభియాన్ (ఎస్ఎస్ఎ) కార్యక్రమాన్ని, 2020 ఆగస్టు 8 నుండి ఆగస్టు 15 వరకు చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్ ) కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించిందని వివరించారు.
ఈ మూడ కేటగిరీల్లోనూ అద్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ డిడిడబ్ల్యుఎస్ డైరెక్టర్ యుగల్ జోషీ తెలిపారు. అలాగే జిల్లాల కేటగిరీలో మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు మూడో స్థానం దక్కిందని ఈ మేరకు యుగల్ జోషీ, మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకి లేఖను పంపించారని తెలిపారు. కాగా, అక్టోబర్ 2 వ తేదీ, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను అందచేస్తారని, అవార్డులు సాధించిన వాళ్ళందరినీ మంత్రి దయాకర్ రావు అభినందించారు.