వరంగల్ త్రినగరిలో సోమవారం ఉదయం నుంచి ఏ వీధి చూసినా సందడే. ఏ రోడ్డు చూసినా కోలాహలమే. మండపాల్లో నవరాత్రులు పూజించిన గణపయ్యను భక్తులు గంగమ్మ ఒడికి వైభవంగా తరలించారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలు వీధుల్లో మార్మోగాయి. ప్రధాన కూడళ్లలో ఓరుగల్లు ఉత్సవ సమితి ప్రతినిధులు గణపయ్య విగ్రహాలకు స్వాగతం పలికారు.