వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలోని పెంబర్తి క్రాస్ రోడ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రావు కథనం ప్రకారం.. మలుగు ఘన్ పూర్ కు చెందిన మేకల లక్ష్మి (38)లచ్చులు దంపతులు గత ఆరు సంవత్సరాల నుండి పెంబర్తి క్రాస్ రోడ్ లోని సారయ్య ఇటుక బట్టీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలను సాధుకుంటూ ఇటుక బట్టీల వద్దే ఉంటున్నారు. గురువారం లక్ష్మి కూరగాయల కోసం సమీప డబ్బాల వద్ద కూరగాయలు కొనేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన గుడికందుల దేవేందర్ హన్మకొండ నుండి అంబాల వైపు వెళుతూ తన ద్విచక్ర వాహనంతో వేగంగా ఢీ కొట్టాడు.
దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఒక గుంతలో పడేసేందుకు దేవేందర్ ప్రయత్నించగా సమీపంలోని కొంతమంది గుర్తించి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన బ్లూకోల్ట్స్ సిబ్బంది రాంప్రసాద్, సదానందం సంఘటన స్థలానికి చేరుకొని వాహన డ్రైవర్ దేవేందర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మ్రృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు తెలిపారు.