విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం విఆర్ఎలు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి సరికొండ వెంకటేశ్వరరాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఎలకు ఇచ్చే వేతనం నామమాత్రమేనని అన్నారు. వారికి ఇచ్చే వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. తీరిక లేదనే సాకుతో వారికి ఒకటవ తారీఖు ఇవ్వవలసిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టటం దారుణమని పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయలమునకు నైట్ వాచ్ మెన్ డ్యూటీని విఆర్ఎలచే చేయించటం దారుణమని అన్నారు. నైట్ వాచ్ మెన్లు గా విఆర్ఎలను నియమించకూడదని ప్రభుత్వ జివో లో లేదని అన్నారు. నెలవారీ జీతమునకు విఆర్ఓల నుండి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకురావాలని నిబంధనలు పెట్టటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. విఆర్ఎలకు నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ జె. శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. తొలుత స్థానిక చెరువుకట్ట సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు విఆర్ఎలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల అసోసియేషన్ పల్నాడు జిల్లా నాయకులు కె. వెంకటరత్నం, మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మీరాహుస్సేన్, నాగేశ్వరరావు, విఆర్ఎలు పాల్గొన్నారు.