గొర్రెలు, మేకల పెంపకం, వాటి పోషణకు తీసుకోవలసిన మెలకువల గురించి జీ.కొండూరులోని స్థానిక పశు వైద్యశాలలో.. పశువైద్య అధికారిణి ఎం.ప్రమీలరాణి ఆధ్వర్యంలో పెంపకం దార్లకు ఒక్కరోజు శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశువైద్యశాఖ సహాయ సంచాలకులు డా.కె.రాధా కృష్ణమూర్తితో పాటు.. గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షులు కందుల ఏసురాజు యాదవ్ లు హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు పెంపకం దారులకు కొన్ని సూచనలు, సలహాలు అందించారు. విత్తన పొట్టేళ్లు ఎంపిక, పోషణ వాటి మార్పిడి విషయంలో పాటించాల్సిన మెలకువల గురించి అవగాహన కల్పించారు. సాంద్రత పద్దతిలో గొర్రెలు, మేకల పెంపకం అలాగే.. సూడి గొర్రెలు, మేకల పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. పొట్టేళ్ల పిల్లల పెంపకం, దాణా తయారీలో తీసుకోవలసిన మెలకువలు, బాహ్య, అంతర పరాన్న జీవుల నిర్మూలన, వాటివల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం వంటి వాటి గురించి పెంపకందార్లలో అవగాహన పెంచారు. ఈ కార్యక్రమంలో పటాపంచల లక్ష్మీ నారాయణ, జీవమిత్ర కె.వెంకటేశ్వర రావు, జి.కొండూరు, గడ్డమణుగు, చెరువు మాధవరం గ్రామాలకు చెందిన పెంపకందారులు హాజరయ్యారు.