స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలమేరకు ఇటీవల అధికారులు ప్రాదేశిక నియోజ కవర్గాల ఎన్నికల ప్రక్రియ ను కూడా పూర్తి చేశారు.మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలను కులాలవారీగా తయారు చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల ముసాయిదా కు కూడా ఉన్నతాధికారులు ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఓటర్ల జాబితాలను పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు బహిరంగ ప్రకటన చేశారు.దీంతో క్షేత్రస్థాయిలో జరగాల్సిన ఏర్పాటులన్నీ పూర్తి చేసినట్లేనని చెప్పాలి.ఇక రిజర్వేషన్లు,ఎన్నికల తేదీల ప్రకటనే తరువాయి. మండల వ్యాప్తంగా 16 ప్రాదేశిక,ఒక జెడ్పిటిసి సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.ఇప్పటికే ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు.ఈ ఎన్నికలకు సంబంధించి మండలంలో మొత్తం 46,751 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.వీరిలో పురుషులు 23,287 కాగా మహిళ ఓటర్లు 23,461మంది,ఇతరులు ముగ్గురు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మండల పరిషత్,గ్రామ పంచాయితీ లలో ప్రత్యేక అధికారుల పాలన కొన సాగుతుంది.అయితే గ్రామ పంచాయితీల కంటే ముందుగా మండల,జిల్లా పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది.కేవలం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ను మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎవరూ ముందుకు రాకపోయినా అధికార,ప్రతిపక్షానికి చెందిన రాజకీయ నాయకులు మాత్రం చాపకింద నీరులా పాములు కడుపుతున్నట్లు తెలుస్తోంది.కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో నైనా తమ సత్తా చాటాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టిడిపి నాయకులకు,కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో ఏవిధంగా విజయం సాధించామో అదేమాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ సత్తా ఏమిటో మరోసారి రుజువు చేసేందుకు ఉవ్విళ్లూగుతున్నారు.చివరికి ఎవరి సత్తా ఏమిటో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.