ఆరోగ్య సేవలు నిల్.. ఆన్లైన్ సేవలు ఫుల్

769చూసినవారు
ఆరోగ్య సేవలు నిల్.. ఆన్లైన్ సేవలు ఫుల్
సర్కార్ దవాఖానలలో వైద్య సేవలు అందని ద్రాక్షా గా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాధారణ జబ్భులకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పరుగులు పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు రోగాన్ని తగ్గించుకుందామని పిహెచ్సికి ఆశగా వెళితే నిరాశ తోనే తిరిగి రావాల్సి వస్తుందని రోగులు అంటున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న ఏఎన్ఎం లకు, ఆశా కార్యకర్తలకు, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అదనపు పనిభారం అప్పజెప్పడంతో వారి నుంచి ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు దూరమవుతున్నాయి. పిహెచ్ సి లలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్లు, సూపర్ వైజర్లు ఆన్లైన్ సేవలకే పరిమితమయ్యారు. అనడంలో అతిశయోక్తి కాదు.

గ్రామాలు, పట్టణాలలో ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు,హెల్త్ అసిస్టెంట్లు డోర్ టు డోర్ తిరిగి గర్భవతులు, బాలింత లను గుర్తించి వారికి నెలవారీ వైద్య పరీక్షలు చేయడం, ఆరోగ్య సూత్రాలు పాటించేలా చేయడం, టీకాలు వేయించడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం, అవసరమనుకున్న వారికి మందుబిల్లలు ఇవ్వడం వంటివి చేయాల్సి ఉంది. కాని వీరికి రికార్డు పనిభారం అధికమవడంతో వీరు అందించాల్సిన వైద్య సేవలు మరుగున పడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో గర్భిణీలు, బాలింతలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్థితి నెలకుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఒక సమయం అనేది లేకుండా పై అధికారులు రిపోర్టులు అడుగుతుండటంతో ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు వారు చేయాల్సిన పనులు పక్కన పెట్టి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అడిగిన గణాంకాలు పంపించడమే వారి పనిగా మారింది. ఈ తరుణంలో పిహెచ్ సిసబ్ సెంటర్లలో మందుబిల్లలు ఇచ్చే వారు లేరంటే నమ్ముతారా..!ఇది నిజం. ఇదిలా ఉంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వైద్యాధికారులు ఎవరు డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఏపిహెచ్ సిలో రెగ్యులర్ గా పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక పిహెచ్ సి లో డిడిఒగా ఉన్న వైద్య అధికారి డిప్యుటేషన్ పై వెళ్లి సుమారు 11 నెలలవుతున్నా నేటికీ తిరిగి ఆ పిహెచ్సి లో అడుగు పెట్టలేదు. వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని చెప్పడానికి అందుకు ఉదాహరణ ఇదే.

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం జి.కొండూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ముగ్గురు వైద్యాధికారులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు డిప్యుటేషన్ పై ఎప్పుడో వెళ్లిపోయారు. ఉన్న ఇద్దరిలో ఒకరు డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 16 మంది ఏఎన్ఎం లు పని చేస్తుండగా ఇద్దరు డిప్యుటేషన్ పై వెళ్లారు. హెల్త్ అసిస్టెంట్లు ఆరుగురిలో నలుగురు డిప్యుటేషన్ పై వెళ్లిపోయారు. పిహెచ్సి కింద 10 సబ్ సెంటర్లు నడుస్తున్నాయి. సూపర్వైజర్లు నలుగురు పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు డిప్యుటేషన్ పై వెళ్లారు. ఆశా కార్యకర్తలు 40 మంది పనిచేస్తున్నారు. మండలంలో మొత్తం ఈ ఆసుపత్రి పరిధిలో 55,400 మంది జనాభా ఉంటే సగటున రోజుకి ఒపి కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే. ఇది పిహెచ్ సి సిబ్బంది చెబుతున్న మాట. దీనిని బట్టి ఇక్కడ ఆరోగ్య సేవలు ఏ మేరకు అందుతున్నాయో ఇట్టే అర్ధమవుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పిహెచ్సి లపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు చెప్పుకోవడం కొసమెరుపు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్