మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలోని ధీరజ్ కృష్ణా ఎంటర్ ప్రైజెస్ విత్తనాల షాపును శనివారం సాయంత్రం అధికారులు జాయింట్ తనిఖి చేశారు. స్థానిక తహసీల్దార్ షేక్.ఇంతియాజ్ పాషా, మండల వ్యవసాయ అధికారి యం.రామ్ కుమార్, జి.కొండూరు హెడ్ కానిస్టేబుల్ నారాయణలతో కలిసి విత్తనాల షాపులో తనిఖీలు నిర్వహించారు. షాపుకు వాలిడ్ లైసెన్స్ ఉందా.. అని షాపు నిర్వాహకులను అడిగి, లైసెన్స్ ధ్రువీకరణ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే స్టాకు రిజిస్టర్ లను పరిశీలించారు. రైతులకు విక్రయిస్తున్న విత్తనాల రకాల గురించి నిర్వాహకులను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. కాలం చెల్లిన విత్తనాలు రైతులకు అంట కడితే సహించేది లేదన్నారు. మచ్చుకగా కొన్ని పత్తి విత్తనాల ప్యాకెట్స్ లను ఆయన పరిశీలించారు. వాటిపై ఉన్న మ్యాని ఫ్యాక్చరింగ్ డేట్లను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ విలేకర్లతో మాట్లాడుతూ... జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఫెర్టీసైడ్, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులలో జాయింట్ తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ఫెర్టిలైజర్, విత్తనాల షాపుల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఫెర్టిలైజర్, విత్తనాల షాపుల నిర్వాహకులు ఉన్నారు.