నాయుడుపేట మండలంలోని ఆలయాలు మరియు మసీదులు, చర్చల వద్ద భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. నాయుడుపేట పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మండలం పరిధిలోని ఆయా గ్రామాలకు కేటాయించిన పోలీసులు మరియు మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అసాంఘిక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ప్రార్థన మందిరాల పై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో నాయుడుపేట పట్టణ మరియు మండలంలోని ప్రార్థన మందిరాలతో పాటు వాటి నిర్వాహకుల పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రధానంగా ఆలయ నిర్వాహకులతో మాట్లాడి సీసీ కెమెరాలతో పాటు నిఘా ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నాయుడుపేట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.