ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా సముద్ర తీరంలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నిర్మించేందుకు సర్కారు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పనులు ప్రారంభించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించేందుకు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు జ్యుడీషియల్ రివ్యూకు కూడా పంపించింది. తొలిదశలో మూడు బెర్తులతో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
36 నెలల్లో పనులు పూర్తి..
రామాయపట్నం పోర్టు పనులను 36 నెలల్లోనే పనులు పూర్తి చేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఈ నెలలోనే బిడ్డింగ్ విధానాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలి దశలో మూడు బెర్తులతో పనులు ప్రారంభించేలా విధివిధానాలను రూపొందిస్తున్నారు. అందుకుగాను ప్రాజెక్టు వ్యయ అంచనా విలువ రూ.2,169.62 కోట్లుగా నిర్ణయించారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. పోర్టు నిర్మాణాల్లో అనుభవమున్న బడా కాంట్రాక్టర్లను టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. రివర్స్ టెండర్ ద్వారానే కాంట్రాక్టును కట్టబెట్టేలా ఇప్పటికే నిర్ణయించారు. పోర్టుకు తొలి దశలో మూడు బెర్తులను 900 మీటర్ల పొడవుతో 34.5 మీటర్ల లోతు ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.