రైతులకు అండగా పాయకరావుపేటలో జనసేన పార్టీ నిరాహార దీక్ష

466చూసినవారు
రాష్ట్రంలో వరుస తుపాన్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలోని తన నివాసంలో నిరాహారదీక్ష చేపట్టారు. పవన్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు నిరాహాదీక్షలు చేపట్టాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జనసేన నాయకులు బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ ఈ ఏడాది వరుస తుపాన్ల కారణంగా పంటలు దెబ్బతినటంతో అన్ని విధాలుగా రైతులు నష్టపోయారన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి రైతులకు సంఘీభావం తెలియజేసి, వారికీ అండగా పోరాటం చేస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టె రైతన్నలను ఆదుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన ఒక్కో రైతుకు ప్రభుత్వం 35 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని, తక్షణ సాయంగా 10 వేల రూపాయలు సాయమందించాలని జనసేన డిమాండ్ చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు రాయి బాబ్జి, ముద్దలా నానాజీ, గబ్బర్ సింగ్, ఇంజరపు సూర్య, గొల్లల రాజా, బండి కిరణ్, గొట్టే రాము, బండి రాఘవ, దుబాసీ భాను , మిరియాల రాంజీతోపాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్