విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం జాతీయ రహదారి నామవరం జంక్షన్ సమీపంలో బుధవారం రహదారిపై ముందు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నక్కపల్లి మండలానికి చెందిన నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. పాయకరావుపేట నుంచి ప్రయాణికులతో నక్కపల్లి బయలుదేరిన ఆటో నామవరం జంక్షన్ సమీపంలోకి రాగా.. అదేసమయంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విశాఖపట్నం వెళుతున్నఏపీ 31ED8134 నెంబర్ గల మారుతి షిప్ట్ డిజైర్ బ్లూ కలర్ కారు వేగంగా వెళుతూ ముందు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది.
ఆటో రోడ్డుపై బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆటో డ్రైవర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తూర్పు గోదావరి జిల్లా తుని ఎన్టీఆర్ ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రాజబాబు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు.. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాయకరావుపేట ఎస్సై దీన బంధు పేర్కొన్నారు.