నక్కపల్లి మండలం, ఉద్దండపురం జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. పాయకరావుపేటనుంచి అనకాపల్లి వెళ్తున్న ఎపిఎస్ ఆర్టీసి బస్సు ఉద్దండపురం చేరుకోగా, అదే సమయంలో స్టీరింగు పట్టేయటంతో బస్సు అదుపు తప్పి ప్రక్కనున్న పంట కాలువ లోకి ఒరిగిపోయింది . ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న యస్. రాయవరం మండలానికి చెందిన ఇరువురు మహిళలు, బస్సు డ్రైవర్ గాయపడ్డారు. వీరు యస్. రాయవరం మండలం కోనవాని పాలెం గ్రామానికి చెందిన కొండ్ర వెంకటలక్ష్మి, అదే మండలం భీమవరం గ్రామానికి చెందిన గుడాల సత్యవతి (43)లకు గాయాలయ్యాయి. ఈమె తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో సచివాలయ మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు డ్రైవర్ ముత్యాల సోమరాజు గాయపడ్డారు. ఈయన విశాఖజిల్లా గొలుగొండ మండలానికి చెందిన వారు. ఈ విషయమై సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాధంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నక్కపల్లి ఎస్.ఐ శివరామకృష్ణ పేర్కొన్నారు.