ఆ వంతెన అంటేనే వాహన దారులు జంకుతున్నారు. ఆ వంతెన మీదుగా ప్రయాణం అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేమిటని అనుకుంటున్నారా.. అయితే మీరు వివరాలు తెలుసుకోవాల్సిందే.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొల్హారి వంతెన పరిస్థితి ఇది. కొల్హారి గ్రామం వద్ద అంతరాష్ట్ర రహదారి పై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెన పై మోకాలు లోతు గోతులు ఏర్పడ్డాయి. దీంతో గత కొన్ని రోజులుగా నిత్యం వాహనాలు ఈ గోతుల్లో పడడంతో వాటి ఇంజన్లు పగిలి పోతున్నాయి. వాహనదారులు లబోదిబోమంటున్నారు. వంతెన గోతుల్లో నీరు నిలిచి ఉన్నపుడు లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ వంతెన పై రాకపోకలు సాగిస్తుంటాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.