పశువులకు వచ్చే ఈ ప్రమాదకర వ్యాధి గురించి తెలుసా?

20925చూసినవారు
పశువులకు వచ్చే ఈ ప్రమాదకర వ్యాధి గురించి తెలుసా?
పశువుల నుండి మనుషులకు సోకే వ్యాధుల్లో బ్రుసేల్లోసిస్ వ్యాధి ప్రమాదకరమైనది. ఈ వ్యాధి బ్రుసేల్లా అనే బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి వల్ల పశువుల పొదుగు, జననేంద్రియ అవయవాలు దెబ్బతిని చూలి పశువుల్లో గర్భస్రావాలు, కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. దీని వల్ల పశువులు పాలకు సంతానోత్పత్తి లేకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారు. డైరీ ఫార్మ్ లో అయితే ఇంకా ఎక్కువగా నష్టాలను చూడవలసి ఉంటుంది.

వ్యాధి వ్యాప్తి
-వ్యాధి సోకిన పశువు గర్భస్రావాలు / మాయ ద్వారా.
-గర్భస్రావాలు / మాయతో కలుషితం అయిన మేత, నీటి ద్వారా.
-ఈ బ్యాక్టీరియా ఆబోతులు, దున్నల ద్వారా ఆడవాటిని కలిసినప్పుడు వీటి వీర్యం ద్వారా.
-ఈ బ్యాక్టీరియాతో కలుషితమైన కృత్రిమ గర్భధారణ చేసే పరికరాల ద్వారా.
-పశువులను పరీక్షించడానికి పశువైద్యులు చేయి పెట్టినప్పుడు వారికి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు
-చూలి పశువుల్లో సాధారణంగా 7వ నెల తరువాత గర్భస్రావాలు జరగడం ముఖ్య లక్షణం
-ఈ బ్యాక్టీరియా పిండం ఉండే గర్భకోశానికి చేరి, పిండం అంటి పెట్టుకుని ఉండే కాటిలెడన్లను కుళ్ళిపోయేలా చేస్తాయి. దీనివల్ల పిండం చనిపోయి గర్భస్రావం లేదా ఈసుకు పోవడం జరుగుతుంది. ఒక్కోసారి పశువుల గర్భకోశంలో చీము చేరి -పశువుకు దూడలను పుట్టించే శక్తిని కోల్పోతుంది. ఆబోతులు, దున్నలలో వృషణాలు వాపు ఉండి వీర్యంలో శుక్రకణాలు చనిపోయి ఉంటాయి. అంతేగాక పశువుల్లో కీళ్ళవాపు కూడా గమనించవచ్చు.
వ్యాధి నిర్ధారణ
-చూడి చివర నెలల్లో గర్భస్రావం లేదా ఈసుకు పోవడం
-ఈసుకు పోయిన పశువు రక్తం, పిండం, పాలు, గర్భస్రావాలను ప్రయోగశాలల్లో పాలతో అయితే మిల్క్రింగ్ టెస్ట్, రక్తంతో అయితే అగుటినేషన్ పరీక్ష / రోజ్ బెంగాల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
చికిత్స - నివారణ
-వ్యాధి వచ్చిన పశువులను మంద నుండి వేరుచేసి అంటి బయోటిక్స్, టెట్రా సైక్లిన్, డాక్స్ సైక్లిన్ వాడాలి.
-మాయను, పిండాన్ని గర్భ సావాలతో కలుషితమైన మేతను కాల్చివేయాలి.
-గర్భకోశంలో చీము నిలవకుండా చేసి చికిత్స.చేయించాలి.
-పశువు కొట్టాలను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయించాలి.
-ఆరోగ్యకరమైన ఆబోతులు, దున్నలు వాటినే దాటించడానికి ఉపయోగించాలి.
-వ్యాధి వచ్చిన పశువుల పాలు వాడకూడదు.
-వ్యాధి నివారణ టీకాలు వేయించడం మంచిది.
-దూడలకు 4-6 మాసాల వయస్సులో ప్రభుత్వం వారు అందించే ఉచిత టీకాలను (బ్రుసెల్లకాటన్ సైన్ 19 టీకా) వేయించడం ద్వారా యుక్త వయస్సు వచ్చే వరకు ఈ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

సంబంధిత పోస్ట్