హుజూరాబాద్ : భారతదేశానికి గొప్ప సంపద నేటి యువతేనని, యంత్ర విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని హైదరాబాద్ జేఎన్‌టీయూ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన సవాళ్లు- అవకాశాలు అనే అంశంపై మూడు రోజుల కార్యశాలను ఏర్పాటు చేశారు. కళాశాల సమావేశ మందిరంలో ప్రిన్సిపల్ కందుకూరి శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అధ్యాపకులు, విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశోధన రంగంలో దేశం అభివృద్ధి చెందితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులను వాటివైపు అడుగులు వేసేలా అధ్యాపకులు తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందుకు అధ్యాపకులు అన్ని రకాలుగా సహాయం అందించాలని కోరారు. వివిధ రంగాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి విద్యార్థులు పరిశోధనలు చేయాలన్నారు. పరిశోధనలో అంశాలను ఎంచుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దానిపై పూర్తి అవగాహనతో పాటు వివరాలను సేకరించాలన్నారు. అనంతరం జగిత్యాల జేఎన్‌టీయూ ఆచార్యుడు డాక్టర్ ఎన్.వి.ఎస్.రాజు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అవలీలగా దొరికే వస్తువులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు నూతనంగా ఆలోచించాలన్నారు. వస్తువులను కనుగొనాలనే జిజ్ఞాస కలిగి ఉండాలని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో కార్యశాల కన్వీనర్, మెకానికల్ విభాగాధిపతి ఎం.వి. సతీష్‌కుమార్, సహ సమన్వయకర్తలు ఎస్.రాజేంద్రప్రసాద్, అధ్యాపకులు మర్రి ప్రదీప్‌కుమార్, రిజిస్ట్రార్ పి.వెంకటయ్య, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.