ఏ పంటకు ఏ ఎరువు మంచిది? చీడ పీడల నివారణకు ఎలాంటి రసాయన మందు పిచికారీ చేయాలి? ఇలాంటి సాగు సంబంధిత విషయాల్లో మీకున్న సందేహాలను మాకు కామెంట్ల రూపంలో పంపించండి. వాటికి సమాధానాలను వ్యవసాయాధికారుల ద్వారా ప్రతీ మంగళ, గురు, శని వారాల్లో యాప్ లో ప్రచురిస్తాం. గత రెండు రోజులుగా మాకు వచ్చిన ప్రశ్నలకు వ్యవసాయాధికారి ఏ. అజయ్ కుమార్ గారి నుంచి సమాధానాలు అందిస్తున్నాం. మిగిలిన కొన్ని ప్రశ్నలకు తర్వాత వారాల్లో సమాధానాలు ప్రచురిస్తాం. ప్రశ్నలకు క్లుప్తంగా, అర్థమయ్యేలా పంపించగలరు.
ప్రశ్న: మిరప పంటలో ఆకు ముడత బాగా వస్తుంది. నివారణకు మందు చెప్పండి?
జవాబు: మిరప పంటలో పైముడత ఉన్నట్లైతే ఫిప్రోనిల్ లీటరు నీటికి 2మి.లీ మరియూ కింది ముడత నల్లి ద్వారా వస్తుంది కావున లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం పొడి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందును పిచికారీ చేసినా ఉధృతి తగ్గకపోతే స్పైనోసాడ్ ఎకరానికి 75 మి.లీ పిచికారీ చేయాలి.
ప్రశ్న: వరి పొలం ఎర్రగా అవుతోంది?
జవాబు: వరి పొలం ఎర్రగా అవడం మూడు రకాలుగా ఉంటుంది. మొదటగా మనకి పంట వేసిన 50 రోజుల్లో గనక ఆకు ఎరుపెక్కి, ఆకు విరిచినప్పుడు శబ్ధం వచ్చినచో జింకు సల్ఫేట్ లీటరు నీటికి 2 గ్రా. కలుపుకుని పిచికారీ చేయాలి. మరియూ వర్షాలు పడినప్పుడు ఆకు ఎరుపెక్కడం అనేది బాక్టీరియా ఆకు ఎండుతెగులు లక్షణం ఈ ఆకు ఎండు తెగులు నివారణకు మొదటగా పొలాన్ని ఆరబెట్టాలి. తర్వాత ప్లాంటామైసిన్ ఎకరానికి 100 గ్రాములు లేదా కాపరాక్సీ క్లోరైడ్ ఎకరానికి 600 గ్రా. పిచికారీ చేయాలి.
ప్రశ్న: తెలంగాణ సోనా వరి నాటు వేసి 45 రోజులు అవుతోంది. వరి మొత్తం ఎర్రగా కొసలు మాడినట్లు అవుతోంది. ఏ మందు వాడాలో చెప్పగలరు?
జవాబు: పై ప్రశ్నకు సూచించిన మందులు పిచికారీ చేస్తే సరిపోతుంది.
ప్రశ్న: పత్తిలో పచ్చ దోమ కంట్రోల్ కావడం లేదు?
జవాబు: పచ్చదోమ నివారణకు థయోమిథాక్సోమ్ ఎకరానికి 40 గ్రా. పిచికారీ చేయాలి. లేదా ఫ్లూరికామైడ్ ఎకరానికి 75 గ్రా. పిచికారీ చేయాలి.
ప్రశ్న: మిరపతోటలో అధిక దిగుబడికి ఏ మందు వాడాలి?
జవాబు: మిరపతోట 120 రోజుల లోపు వయస్సు ఉన్నట్లైతే ఎకరానికి 65 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నెలకు ఒక సారి 120 రోజుల వరకు వేసుకోవాలి.
ప్రశ్న: వరిలో దోమ నివారణకు మందు చెప్పగలరు?
జవాబు: దోమ అధికంగా ఉన్నట్లైతే పైమెట్రోజిన్ ఎకరానికి 100 గ్రా. 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేయాలి.
ప్రశ్న: పత్తిలో పూత రావడం లేదు. ఆకు ముడత, పూత రాలడం కూడా ఉంది. ఏ మందు వాడాలి?
జవాబు: పచ్చదోమ నివారణకు థయోమిథాక్సోమ్ ఎకరానికి 40 గ్రా. పిచికారీ చేయాలి. పూత ఆగడానికి ప్లానోఫిక్స్ ఎకరానికి 50 ఎం.ఎల్ 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత రావడానికి ఎకరానికి 25 కిలోల యూరియా, 12.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
ఈ పోస్టును మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా ఈ సమాచారాన్ని వారికి తెలియజేయండి.