నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమాడ దూరంగా ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా నారాయణపేట పరిస్థితి నెలకొన్నది. నారాయణపేట మున్సిపాలిటీ అత్యంత పురాతనమైనది. ఈ మున్సిపాలిటీ 1947 సంవత్సరంలో ఏర్పాటైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి మున్సిపాలిటీ నారాయణపేటయే. ఈ మున్సిపాలిటీ లో 23 వార్డులున్నాయి. వీటిన్నంటికీ ఈ సారి ఎన్నికలు జరగనున్నాయి. నారాయణపేటలో 2011 జనాభా లెక్కల ప్రకారం 29,553 జనాభా ఉండగా, ప్రస్తుతం సుమారు 55వేల వరకూ జనాభా ఉండవచ్చునని అంచనా. ఈ మున్సిపాలిటీలో గత ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఛైర్మన్ మహిళలకు రిజర్వు అయింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకొని ఛైర్మన్ పీఠం దక్కించుకున్నది. బీజేపీకి 13, టీడీపీ 3, కాంగ్రెస్ 2, టీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1 స్థానాలను గెలుచుకున్నాయి. టీడీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో నారాయణపేట మున్సిపాలిటీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. నారాయణపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఏడాది కాలం పూర్తి కాకుండా టీడీపీ నుంచి గెలుపొందిన ఎస్ రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సదరు ఎమ్మెల్యే మున్సిపాలిటీపై కన్ను వేసి బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లను టీఆర్ఎస్ లోకి లాగారు. బీజేపీ ఛైర్మన్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే సరికి మున్సిపాలిటీ పాలక మండలి టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అప్పటి వరకూ నారాయణపేట పట్టణంలో నాల్గు దశాబ్ధాలుగా బలంగా ఉన్న బీజేపీకి చావు దెబ్బ తగిలింది.
నారాయణపేట మున్సిపాలిటీ అతి పురాతనమైనదని పేరున్నప్పటికీ అభివృద్దికి ఆమాడ దూరంలో ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉన్నప్పటికీ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. చేనేత వస్త్రాలు, బంగారు, చెప్పుల విక్రయాలకు ప్రసిద్ధి. ప్రతి బుధవారం సంత జరుగుతుంది. వీటిలో ఎద్దుల సంతకు బాగా ప్రత్యేకత ఉంది. ఈ సంత కర్ణాటక ప్రాంతంలోని ప్రజలతో నిండి ఉంటుంది.
నారాయణపేట మున్సిపాలిటీలో రోడ్లన్ని బురదమయంగా ఉన్నాయి. వర్షాకాలం వస్తే రోడ్లన్ని చిత్తడిగా మారుతాయి. గడిచిన ఐదేళ్లల్లో 150కోట్ల నిధులను కేటాయించగా, వీటిలో రూ. 90కోట్లు మాత్రమే విడుదలైనట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. అధికార పార్టీ అండ ఉన్నప్పటికీ పెద్దగా నిధులను వెచ్చించలేదని స్థానికులు వాపోతున్నారు.