ఘోర ప్రమాదం జరిగింది ఇలా?

16121చూసినవారు
ఘోర ప్రమాదం జరిగింది ఇలా?
మంచి తనానికి మారు పేరు లుకా.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన లూక దాదాపు రెండు దశాబ్దాల క్రితమే కొల్చారం మండలంలోని రంగంపేటకు వలస వచ్చారు. ఇక్కడే చర్చి నిర్వహణ బాధ్యతలు చూస్తూ అందరిలో ఒకడిగా మారిపోయారు. వీరి కుటుంబసభ్యులూ అందరితో కలుపుగోలుగా ఉండేవారు. తనకు పరిచయం ఉన్నవాళ్లు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సత్వరమే స్పందించే వ్యక్తిగా లూక పేరుతెచ్చుకున్నారు. సొంత కారులో వారిని ఆస్పత్రులకు తీసుకెళ్తుంటా రు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివేక్‌ను చూడటానికి రెండు రోజుల క్రితం మరికొందరితో కలిసి వచ్చి వెళ్లారు.

శుక్రవారం ఇంటికి పంపుతున్నారనే విషయం తెలియడంతో కారులో తన భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. అంతా కలిసి కారులో స్వగ్రామానికి వెళుతున్న తరుణంలో చౌటకూరు వద్ద లారీని ఢీకొనడంతో లూక, దీవెన, అంబాదాస్‌, పద్మ, వివేక్‌ ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలారు. లూక, దీవెన మరణించారనే వార్త తెలుసుకున్న అతడి సన్నిహితులు పెద్ద సంఖ్యలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకున్నారు. ‘మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లావా దేవుడా..’ అంటూ విలపించారు. మార్చురీ గది కిటీకిల్లో నుంచి వారి మృతదేహాలను చూస్తూ గుండెలవిసేలా రోదించారు. తమతో ఎలాంటి బంధుత్వం లేకపోయినా, ఎవరికి కష్టమొచ్చినా ముందుండే వ్యక్తి మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం జాతీయ రహదారి 161 విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో 40 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లరాదని చాలా చోట్ల సూచికలు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన స్థలం వద్ద రోడ్డు ఇరుకుగా ఉంది. ఈ ప్రాంతంలో అటూ ఇటూగా 100 మీటర్ల పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి చోట లూక దాదాపు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వాహనం అదుపుతప్పి జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న అయిదుగురు మృతిచెందారు.

ట్యాగ్స్ :