బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, ప్రధాన కార్యదర్శి కొన్నే శంకర్ గౌడ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నార్కెట్ పల్లిలో బీసీ టీచర్స్ యూనియన్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ల అభివృద్ధి కి గొడ్డలి పెట్టుగా మారిన క్రిమి లేయర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాల లను రేషనలైజేషన్ పేరిట మూసి వేస్తామంటే బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారు అన్నారు. ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది అన్నారు.
ప్రభుత్వం పేద విద్యార్థులకు కొరకు గురుకుల పాఠశాలల ఏర్పాటు హర్షణీయం కానీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మినీ గురుకులాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. లక్షలు వెచ్చించి కంప్యూటర్ లు కొనుగోలు చేసి కంప్యూటర్ బోధకులను నియమించడం మరిచారని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు భారంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. సెలవు మంజూరు పై కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లకు ఇచ్చిన అధికారాలకు సంబంధించిన ఉత్తర్వు నెంబర్ 6225 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్గ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదును నార్కెట్ పల్లి, ఎల్లారెడ్డి గూడెం, నెమ్మాని, షాపల్లి, జువ్విగూడెం తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీటియు నార్కెట్ పల్లి మండల శాఖ అధ్యక్షుడు నేర్నకంటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గుండ్ల పల్లి వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు పూస నర్సింహ, చిత్తలూరు మల్లి ఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.