ఐపీఎల్ 14వ సీజన్‌లో రెండో ఫైనలిస్ట్ ఎవరో ఈరోజు తేలనుంది. క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, ఎలిమినేటర్ లో బెంగళూరును చిత్తు చేసిన కోల్‌కతా ఈరోజు తలపడబోతున్నాయి. స్పిన్నర్లకు సహకరిస్తున్న స్లో పిచ్ పై నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ జట్టులో టాపార్డర్ బలంగా కనిపిస్తుండగా సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి రూపంలో ముగ్గురు స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉన్నారు. స్పిన్నర్లు విజృంభిస్తే కోల్‌కతాకు, బ్యాటర్లు రెచ్చిపోతే ఢిల్లీకి ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన అశ్విన్ కేవలం 5 వికెట్లే తీశాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న పేస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ కోలుకుంటే టామ్ కరన్ స్థానంలో అతడికి తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. పృథ్వీషా గత మ్యాచ్‌లోనూ చక్కటి ప్రదర్శన చేశాడు. అతనితో పాటు ధవన్, పంత్, శ్రేయస్ సమిష్టిగా రాణిస్తే కోల్‌కతాను ఓడించడం ఢిల్లీకి పెద్ద కష్టం కాకపోవచ్చు.
మరోవైపు ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన కేకేఆర్ తమ జోరు మరోసారి కనబర్చాలని చూస్తోంది. ఆ జట్టు యువ ఓపెనర్‌లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ జట్టుకు శుభారంభాల్ని ఇస్తున్నారు. పవర్ ప్లేలో భారీ షాట్లు ఆడుతున్నారు. నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి లాంటి నాణ్యమైన ఆటగాళ్లు టాపార్డర్‌లో ఉండగా.. దినేశ్ కార్తీక్, మోర్గాన్ ఫినిషింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు.